Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..!

4 Aug, 2022 15:53 IST|Sakshi

ఇటీవలి కాలంలో భారత్‌, పాక్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెం‍ట్లలో మినహా ఈ రెండు జట్లు ఎదురెదురుపడింది లేదు. ఏడాదికో, రెండేళ్లకో లేదా నాలుగేళ్లకో ఒకసారి జరిగే ఈ మ్యాచ్‌ల కోసం ఇరు దేశాల అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు.

అలాంటిది 15 రోజుల వ్యవధిలో ఇరు జట్లు మూడు పర్యాయాలు ఎదురెదురు పడే అవకాశమే వస్తే క్రికెట్‌ ప్రేమికుల ఆనందానికి అవధులుంటాయా..? ఆసియా కప్‌ 2022 పుణ్యమా అని అభిమానుల కల నెరవేరే అవకాశం ఉంది. ఎలాగంటే...

ఆసియా కప్‌ షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్ 28న భారత్‌-పాక్‌లు తొలిసారి గ్రూప్‌ దశలో (గ్రూప్‌ ఏ) తలపడనున్నాయి. ఈ గ్రూప్‌లో భారత్‌, పాక్‌లతో పాటు మరో క్వాలిఫయర్‌ (యూఏఈ, సింగపూర్, హాంకాంగ్, కువైట్ జట్లలో ఒకటి) జట్టు ఉంది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి.

గ్రూప్‌ ఏలో భారత్‌, పాక్‌లే బలమైన జట్లు కాబట్టి.. ఈ రెండు జట్లు సూపర్‌ 4లో మరోసారి తలపడటం ఖాయంగా కనిపిస్తుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సమీకరణలు మారే అవకాశం లేదు. 

ఇక గ్రూప్‌ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లలో ఏవో రెండు జట్లకు సూపర్‌ 4కు చేరే అవకాశం ఉంటుంది. సూపర్‌ 4 దశలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రస్తుతం భారత్‌, పాక్‌ల ఫామ్‌ను బట్టి చూస్తే.. ఈ టోర్నీ ఫైనల్‌కు (గ్రూప్‌ 4లో టాప్‌ 2 జట్లు) చేరే అవకాశాలు కూడా వీటికే ఎక్కువగా ఉన్నాయి.

ఇదే జరిగితే ఫైనల్లో మరోసారి దాయాదుల సమరం తప్పదు. సెప్టెంబర్‌ 11న జరిగే ఆసియా కప్‌ టైటిల్‌ పోరులో భారత్‌, పాక్‌లు అమీతుమీ తేల్చుకుంటాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 15 రోజుల వ్యవధిలో క్రికెట్‌ అభిమానులకు త్రిబుల్‌ ధమాకా తప్పదు.

భారత్‌-పాక్‌లు చివరిసారిగా గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో తలపడ్డ విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌.. పాక్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. 1992 తర్వాత వరల్డ్‌కప్‌లో భారత్‌పై పాక్‌కు ఇది తొలి విజయం. 
చదవండి: Asia Cup 2022: ప్రపంచాన్ని గెలిచేద్దాం.. అంతకంటే ముందు: రోహిత్‌
 

మరిన్ని వార్తలు