ఇంగ్లండ్‌ రావడం లేదు...

8 Aug, 2020 04:34 IST|Sakshi

న్యూఢిల్లీ: సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరగాల్సిన వన్డే, టి20 సిరీస్‌లను భారత్‌ వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. 2021 ఆరంభంలో వీటిని నిర్వహించే అవకాశం ఉంది.  కరోనా తీవ్రత కారణంగా మన దేశంలో ఇప్పుడు ఎలాంటి సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ ఎఫ్‌టీపీలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ – అక్టోబర్‌లలో ఈ సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఇందులో 3 వన్డేలు, 3 టి20లు ఆడాలని గతంలో నిర్ణయించారు. అయితే కోవిడ్‌–19 కారణంగా ఆట జరిగే అవకాశం లేకపోగా... ఇవే తేదీల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. పాత షెడ్యూల్‌ ప్రకారం 2021 జనవరి–మార్చి మధ్య ఇంగ్లండ్‌ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత్‌కు రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ వన్డే, టి20 సిరీస్‌లను కూడా టెస్టు సిరీస్‌లతో కలిసి అదే సమయంలో నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.

మరిన్ని వార్తలు