IND Vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌.. అశ్విన్‌ స్థానంలో సౌరభ్‌ కుమార్‌..?

21 Dec, 2022 18:32 IST|Sakshi

IND VS BAN 2nd Test: ఢాకా వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రేపటి నుం‍చి (డిసెంబర్‌ 22) రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుందని ఢాకా వాతావరణ శాఖ వెల్లడించింది. 

2 టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్‌లోనూ అదే జోరును కొనసాగించి బంగ్లాను వారి సొంతగడ్డపై ఊడ్చేయాలని పట్టుదలగా ఉంది.

అలాగే వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) కూడా ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. పనిలో పనిగా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలను కూడా మెరుగుపర్చుకోవాలని రాహుల్‌ సేన భావిస్తుంది.

కాగా, రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. తొలి టెస్ట్‌ ప్రదర్శన ఆధారంగా ఎలాంటి మార్పులకు అవకాశం లేనప్పటికీ అశ్విన్‌ స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌కు అవకాశం కల్పిస్తారని కొందరు భావిస్తున్నారు.

షేర్‌ ఏ బంగ్లా స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల ఆప్షన్‌కు కట్టుబడి ఉండటం ఖాయమని తెలిస్తోంది. సౌరభ్‌ కుమార్‌..  బౌలింగ్‌తో పాటు ప్రామిసింగ్‌ బ్యాటర్‌ కావడంతో అతనికి ఛాన్స్‌ ఇవ్వడం సబబేనని మరికొందరు భావిస్తున్నారు.

ఈ ఒక్క మార్పు మినహాయించి తొలి టెస్ట్‌ ఆడిన జట్టులో మరో మార్పు చేసే అస్కారం లేదు. జట్టులో ఇదివరకే ఇద్దరు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి తొలి టెస్ట్‌లో బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌ను కొనసాగించాలని, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాల నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఎలాంటి ప్రయోగాలు చేయరాదని మరికొందరు కోరుకుంటున్నారు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌/ సౌరభ్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ 

మరిన్ని వార్తలు