Eng vs Ind 2nd Test 2021: రసపట్టులో.. భారత్, ఇంగ్లండ్‌ రెండో టెస్టు

16 Aug, 2021 04:27 IST|Sakshi

టీమిండియా 181/6

154 పరుగుల ఆధిక్యంలో కోహ్లి బృందం

ఆదుకున్న రహానే, పూజారా

దెబ్బతీసిన వుడ్, మొయిన్‌ అలీ

తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా... రెండో టెస్టులో మాత్రం భారత్, ఇంగ్లండ్‌ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రహానే మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా... మార్క్‌ వుడ్, మొయిన్‌ అలీ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా... ఆఖరి రోజు భారత్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్‌ చేయడంపై ఇంగ్లండ్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి లార్డ్స్‌ టెస్టులో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది.

లండన్‌: మూడో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. నాలుగో రోజు మ్యాచ్‌పైనే పట్టు సాధించే పరిస్థితిని సృష్టించుకుంది. ఆతిథ్య జట్టు పేస్‌–స్పిన్‌ల కలబోత భారత్‌ను కష్టాలపాలు చేసింది. పేసర్‌ మార్క్‌ వుడ్‌ (3/40) ‘టాప్‌’ లేపగా... స్పిన్నర్‌ మొయిన్‌ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (14 బ్యాటింగ్‌), ఇషాంత్‌ శర్మ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ చేతిలో ఒక బ్యాట్స్‌మనే ఉన్నాడు. మిగతా వాళ్లంతా బౌలర్లే!  

వణికించిన వుడ్‌

భారత ఓపెనింగ్‌ జోడీ రాహుల్‌–రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్‌ వుడ్‌ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ సీమర్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్‌ తన వరుస ఓవర్లలో రాహుల్‌ (5), రోహిత్‌ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌)లను పెవిలియన్‌ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్‌ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.  

రహానే అర్ధసెంచరీ
తర్వాత భారత్‌ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్‌లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్‌ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్‌ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్‌లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్‌ వుడ్‌ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్‌ చేశాడు. తర్వాత మొయిన్‌ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్‌ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్‌ చేశాడు. దీంతో మూడో సెషన్‌ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 364;

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 391;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 5; రోహిత్‌ (సి) మొయిన్‌ అలీ (బి) వుడ్‌ 21; పుజారా (సి) రూట్‌ (బి) వుడ్‌ 45; కోహ్లి (సి) బట్లర్‌ (బి) స్యామ్‌ కరన్‌ 20; రహానే (సి) బట్లర్‌ (బి) మొయిన్‌ అలీ 61; పంత్‌ (బ్యాటింగ్‌) 14; జడేజా (బి) మొయిన్‌ అలీ 3; ఇషాంత్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181.
వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175.
బౌలింగ్‌: అండర్సన్‌ 18–6–23–0, రాబిన్సన్‌ 10–6–20–0, వుడ్‌ 14–3–40–3; స్యామ్‌ కరన్‌ 15–3–30–1, మొయిన్‌ అలీ 20–1–52–2, రూట్‌ 5–0–9–0.

మరిన్ని వార్తలు