పంతానికొక్కడు...

6 Mar, 2021 05:05 IST|Sakshi

వీరోచిత సెంచరీతో చెలరేగిన రిషభ్‌ పంత్‌

సుందర్‌ అర్ధ సెంచరీ

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 294/7

ఇప్పటికే 89 పరుగుల ఆధిక్యం

146 పరుగులకు 6 వికెట్లు... చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో భారత్‌ స్కోరు ఇది. ఇంగ్లండ్‌ స్కోరు 205ను అలవోకగా దాటుతుందనుకుంటే మన టాప్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఇక ప్రత్యర్థికి ఆధిక్యం అందించడం ఖాయమనుకున్న స్థితిలో ఒకే ఒక్కడు మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడిన రిషభ్‌ పంత్‌ అద్భుత సెంచరీతో జట్టును ముందంజలో నిలిపాడు. అతనితోపాటు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో రెండో రోజు ముగిసేసరికి టీమిండియాకు పట్టు చిక్కింది. అండర్సన్, స్టోక్స్‌ తీవ్రంగా శ్రమించినా... చివరి సెషన్లోనే భారత్‌ ఏకంగా 141 పరుగులు సాధించడంతో రూట్‌ సేన కుదేలైంది.

అహ్మదాబాద్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే దిశగా భారత్‌ మరో అడుగు వేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో మ్యాచ్‌ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. 89 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సంపాదించింది. రిషభ్‌ పంత్‌ (118 బంతుల్లో 101; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేయగా, వాషింగ్టన్‌ సుందర్‌ (117 బంతుల్లో 60 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి.  

కోహ్లి డకౌట్‌...
ఓవర్‌నైట్‌ స్కోరు 24/1తో ఆట కొనసాగించిన భారత్‌ అనూహ్యంగా కుప్పకూలింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రాకుండా నిరోధించిన ఇంగ్లండ్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి ఫలితం సాధించారు. తొలి సెషన్‌లో 25.2 ఓవర్లు ఆడి 56 పరుగులు మాత్రమే చేసిన భారత్‌ 4 వికెట్లు కోల్పోయింది. ముందుగా పుజారా (17)ను లీచ్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేయగా... స్టోక్స్‌ బౌలింగ్‌లో అనూహ్యంగా లేచిన షార్ట్‌ బంతిని ఆడబోయి కోహ్లి (0) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్వదేశంలో కొంత కాలంగా వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న రహానే (27; 4 ఫోర్లు) దూకుడు ప్రదర్శించబోయాడు. అయితే అండర్సన్‌ చక్కటి బంతికి స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో అతని ఆట ముగిసింది. లంచ్‌ తర్వాత స్టోక్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో అర్ధ సెంచరీ చేజారింది. రోహిత్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అశ్విన్‌ (13) ఈసారి చెప్పుకోదగ్గ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు. ఆరో వికెట్‌ కోల్పోయి సమయానికి భారత్‌ ఇంగ్లండ్‌ స్కోరుకంటే 59 పరుగులు వెనుకబడి ఉంది.  

గిల్‌క్రిస్ట్‌ను గుర్తు చేసేలా...
రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ గురించి, టెస్టు జట్టులో అతనికి స్థానం గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఇన్నింగ్స్‌తో అవన్నీ పటాపంచలైపోయినట్లే! అనవసరపు దూకుడు, పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆడి వికెట్‌ పారేసుకుంటాడులాంటి విమర్శలు ఇక చెల్లకపోవచ్చు. ఎడమచేతివాటం, ఒక విధ్వంసక వికెట్‌ కీపర్‌ భారత్‌కు ఉంటే బాగుంటుందని చాలా కాలంగా కోరుకున్న అభిమానులకు పంత్‌ రూపంలో అలాంటివాడు దొరికినట్లే! తన అద్భుత బ్యాటింగ్‌తో పంత్‌ అన్నింటికీ సమాధానం ఇచ్చేశాడు. సరిగ్గా తొలి సెషన్‌ ముగిసిన తర్వాత పంత్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అటువైపు రోహిత్‌ ఉండటంతో అతను మెల్లగా క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకే ప్రయత్నించాడు. అయితే రోహిత్, అశ్విన్‌ అవుటయ్యాక ఒక్కసారి పంత్‌ జట్టును రక్షించే బాధ్యత తీసుకున్నాడు. ముందుగా ఇంగ్లండ్‌ స్కోరును చేరడమే లక్ష్యంగా అతని బ్యాటింగ్‌ సాగింది. 82 బం తుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత అతను వరుస బౌండరీలతో మరింత చెలరేగిపో యాడు. మరోవైపు సుందర్‌ నుంచి పంత్‌కు చక్కటి సహకారం లభించింది. అండర్సన్‌ బౌలింగ్‌లో ఆహా అనిపించే షాట్‌తో 90ల్లోకి చేరిన పంత్‌ ... రూట్‌ వేసిన బంతిని స్క్వేర్‌ లెగ్‌ దిశగా భారీ సిక్సర్‌ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే అండర్సన్‌ బౌలింగ్‌లో షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో రూట్‌కే క్యాచ్‌ ఇచ్చి పంత్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయి ఇంగ్లండ్‌ ఆశలు కరిగిపోయాయి. .

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 205; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: శుబ్‌మన్‌ గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అండర్సన్‌ 0; రోహిత్‌ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టోక్స్‌ 49; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్‌ 17; విరాట్‌ కోహ్లి (సి) ఫోక్స్‌ (బి) స్టోక్స్‌ 0; అజింక్య రహానే (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 27; రిషభ్‌ పంత్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 101; అశ్విన్‌ (సి) పోప్‌ (బి) లీచ్‌ 13; వాషింగ్టన్‌ సుందర్‌ (బ్యాటింగ్‌) 60; అక్షర్‌ పటేల్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (94 ఓవర్లలో 7 వికెట్లకు) 294.  
వికెట్ల పతనం: 1–0, 2–40, 3–41, 4–80, 5–121, 6–146, 7–259.
బౌలింగ్‌: అండర్సన్‌ 20–11–40–3; స్టోక్స్‌ 22–6–73–2; లీచ్‌ 23–5–66–2; బెస్‌ 15–1–56–0; రూట్‌ 14–1–46–0.

ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పాలనేది జట్టు ప్రణాళిక. నా మనసులో ఆ సమయంలో అదొక్క ఆలోచనే ఉంది. అయితే పిచ్‌ను పరిశీలించిన తర్వాత నేను కొన్ని షాట్లు ఆడగలనని అనిపించింది. కొన్నిసార్లు మంచి బంతులను, బౌలర్‌ను కూడా గౌరవించాలి. అప్పుడు సింగిల్‌తో సరిపెట్టాలి. చెత్త బంతి పడినప్పుడు చెలరేగిపోవాలి. బంతిని చూడటం, ఆపై బాదడమే నా బలం. ముందుగా 206 పరుగులు చేసి ఆపై సాధ్యమైనంత ఆధిక్యం సాధించాలని భావించాం. ప్రతీది జట్టు వ్యూహం ప్రకారమే సాగింది. రివర్స్‌ స్వీప్‌లాంటి షాట్లు ఆడేటప్పుడు ముందే దానిని అంచనా వేయగలిగాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా సాగుతున్నప్పుడు ఇలాంటి షాట్లు వచ్చేస్తాయి. చాలా సందర్భాల్లో స్వేచ్ఛగా ఆడేందుకు నాకు అవకాశమిస్తున్నారు. అయితే నేను కూడా పరిస్థితులను బట్టి ఆడతాను. నా ఆటతో ప్రేక్షకులకు వినోదం అందిస్తే అంతకంటే సంతోషం ఉంటుందా.     
–రిషభ్‌ పంత్‌

నాకు తెలిసి ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్‌ ఎప్పుడో సిద్ధమయ్యాడు. అందుకు కావాల్సిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు. జట్టుకు ఏం కావాలో అది చేసి చూపిస్తున్నాడు. పంత్‌కు సొంతశైలి ఉంది. ఇన్నింగ్స్‌ ఎలా సాగించాలో మేనేజ్‌మెంట్‌ సూచనలు ఇవ్వడం సహజమే కానీ అతను తన తరహాలో ఆడినా మంచిదే. జట్టు పని పూర్తి చేస్తున్నాడు కదా. అది అన్నింటికంటే ముఖ్యం. ప్రతీ టీమ్‌లో భిన్నమైన ఆటగాళ్లు ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఆడేవాళ్లు ఉంటే దూకుడుగా ఆడి సాహసాలు చేసే పంత్‌లాంటి వాళ్లూ ఉంటారు. అతను తన బాధ్యత ఎలా నెరవేర్చినా మాకు సమస్య లేదు. గంట వ్యవధిలోనే మ్యాచ్‌ స్థితి మార్చేయగల పంత్‌ ఈ క్రమంలో తొందరగా అవుటైనా ఎవరూ విమర్శించవద్దు. అన్నట్లు... అతను కొంచెం మెంటల్‌. కాదంటారా!         
–పంత్‌ గురించి రోహిత్‌ శర్మ వ్యాఖ్య

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు