Republic Day 2023: రిపబ్లిక్‌ డే రోజు టీమిండియా గెలిచిన ఏకైక వన్డే ఏదో గుర్తుందా..?

25 Jan, 2023 18:42 IST|Sakshi

గణతంత్ర దినోత్సవం (జనవరి 26) రోజు భారత క్రికెట్‌ జట్టు ఏదైన మ్యాచ్‌ గెలిచిందా..? గెలిచి ఉంటే.. ఆ మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎవరిపై గెలిచింది..? ఈ వివరాలు 2023 రిపబ్లిక్‌ డే ను పురస్కరించుకుని భారత క్రికెట్‌ అభిమానుల కోసం. వివరాల్లోకి వెళితే.. 2019 న్యూజిలాండ్‌ పర్యటనలో ఉండగా భారత జట్టు రిపబ్లిక్‌ డే రోజున ఓ వన్డే మ్యాచ్‌ గెలిచింది. చరిత్రలో ఈ రోజున టీమిండియా గెలిచిన ఏకైక మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. ఆతిధ్య జట్టుపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఒక్క విజయం మినహాయించి రిపబ్లిక్‌ డే రోజు ఇప్పటివరకు టీమిండియాకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా లభించలేదు. ఈ మ్యాచ్‌కు ముందు 3 సందర్భాల్లో ఇదే రోజున టీమిండియా వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ, విజయం సాధించలేకపోయింది.

1985-86 వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా తొలిసారి రిపబ్లిక్‌ డే రోజున అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో  టీమిండియా.. ఆసీస్‌ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతర్వాత 2000 సంవత్సరంలో ఇదే రోజు, అదే అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆసీస్‌ చేతిలోనే రెండోసారి కూడా ఓడింది (152 పరుగుల తేడాతో).

2015 సిడ్నీ వేదికగా రిపబ్లిక్‌ డే రోజున ఆస్ట్రేలియాతోనే జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. ఇలా.. చరిత్రను తిరగేస్తే, భారత క్రికెట్‌ జట్టు 2019లో న్యూజిలాండ్‌పై విజయం మినహాయించి రిపబ్లిక్‌ డే రోజున ఒక్క విజయం కూడా సాధించలేదు. అందుకు ఈ విజయానికి అంత ప్రత్యేకత.

ఇక, ఆ మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌ శర్మ (87), శిఖర్‌ ధవన్‌ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఖర్లో ధోని (48 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్‌.. భారత స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/45), చహల్‌ (2/52) మాయాజాలం దెబ్బకు 40.2 ఓవర్లలో 234 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డౌగ్‌ బ్రేస్‌వెల్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.      

మరిన్ని వార్తలు