వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత్‌

19 Nov, 2020 05:16 IST|Sakshi
ఇంగ్లండ్, భారత జట్ల కెప్టెన్లు రూట్, కోహ్లి (ఫైల్‌)

ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనున్న టీమిండియా

ప్రేక్షకులు కూడా హాజరయ్యే అవకాశం  

లండన్‌: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో భారత క్రికెట్‌ జట్టు పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆగస్టు–సెప్టెంబర్‌ 2021లో టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ తేదీలను వేదికలతో సహా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. 2018 ఆగస్టులో ఈ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడిన కోహ్లి సేన మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుంది. దీంతో పాటు స్వదేశంలో శ్రీలంకతో జరిగే 3 వన్డేలు... పాకిస్తాన్‌తో జరిగే 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ఈసీబీ వెల్లడించింది.

కరోనా కారణంగా ఈ ఏడాది భారీగా నష్టపోయిన ఇంగ్లండ్‌ బోర్డు వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. అన్నింటికంటే ఎక్కువగా భారత్‌–ఇంగ్లండ్‌ మధ్య పోరునే ‘సెంటర్‌ పీస్‌ ఈవెంట్‌’గా భావిస్తూ ఎక్కువ ఆదాయాన్ని ఈసీబీ ఆశిస్తోంది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు (ఆగస్టు 4–8), లార్డ్స్‌లో రెండో టెస్టు (ఆగస్టు 12–16), లీడ్స్‌లో మూడో టెస్టు (ఆగస్టు 25–29), ఓవల్‌లో నాలుగో టెస్టు (సెప్టెంబర్‌ 2–6), మాంచెస్టర్‌లో ఐదో టెస్టు (సెప్టెంబర్‌ 10–14) జరుగుతాయి.  

పాకిస్తాన్‌లోనూ...: 16 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్‌ టీమ్‌ పాకిస్తాన్‌ గడ్డపై క్రికెట్‌ ఆడనుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 14, 15 తేదీల్లో పాక్‌తో (కరాచీ వేదిక) రెండు టి20ల్లో ఇంగ్లండ్‌ తలపడుతుంది. ఈ సిరీస్‌ అనంతరం రెండు జట్లు కలిసి భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు బయల్దేరతాయి. 2005లో చివరిసారి ఇంగ్లండ్‌ జట్టు 3 టెస్టులు, 5 వన్డేల కోసం పాకిస్తాన్‌లో పర్యటించింది.  

మరిన్ని వార్తలు