Rishi Dhawan: ఐపీఎల్‌ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?

27 Jan, 2022 17:51 IST|Sakshi

వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో దేశవాళీ స్టార్‌ ఆల్‌రౌండర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఆటగాడు రిషి ధవన్‌ పేరు లేకపోవడం సగటు క్రికెట్‌ అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. జట్టులో నాణ్యమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కొరత ఉందంటూ ముసలి కన్నీరు కార్చే సెలెక్టర్లకు ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిషి ధవన్‌ కనిపించలేదా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. 


ఐపీఎల్‌లో ఆడకపోవడమే రిషి ధవన్‌ చేసిన నేరమా, అందుకే అతన్ని టీమిండియాకు ఎంపిక చేయలేదా అంటూ అతని అభిమానులు నిలదీస్తున్నారు. ఒకప్పుడు దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ ఆధారంగానే టీమిండియాకి ఎంపిక చేసేవాళ్లని, ఇప్పుడేమో ఐపీఎల్‌ ప్రతిభ ఆధారంగా సెలక్షన్ జరుగుతోందంటున్నారు టీమిండియా అభిమానులు. గత ఐపీఎల్‌లో కేవలం కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించి జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌ను ఇందుకు ఉదహరిస్తున్నారు. సెలెక్టర్లు ఇకనైనా మొద్దు నిద్రను వీడి ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లను ఎంకరేజ్‌ చేయాలని, ఇది భారత జట్టుకు మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. 


కాగా, గతేడాది ముస్తాక్ ఆలీ టోర్నీలో అద్భుతంగా రాణించిన రిషి ధవన్‌..  విజయ్‌ హజారే ట్రోఫీలో చెలరేగిపోయాడు. హిమాచల్‌ప్రదేశ్ జట్టుని ముందుండి నడిపించి, ఆ జట్టుకు మొట్టమొదటి దేశవాళీ ట్రోఫీని అందించాడు. ఫైనల్లో పటిష్టమైన తమిళనాడును మట్టికరిపించడంలో రిషి కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను కీలకమైన 3 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి సత్తా చాటాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2021లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన రిషి.. 69.33 సగటుతో 458 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 5.95 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. 


అంతకుముందు ముస్తాక్ ఆలీ టోర్నీలో సైతం రాణించిన రిషి.. 117 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కే ఎంపికవుతాడని అంతా ఊహించారు. అయితే, అప్పుడు హ్యాండ్‌ ఇచ్చిన సెలెక్టర్లు.. తాజాగా విండీస్‌ సిరీస్‌కు కూడా మొండి చెయ్యే చూపించారు. కాగా, టీమిండియా తరఫున 3 వన్డేలు, ఓ టీ20 ఆడిన ధవన్‌.. ఐపీఎల్‌లో కూడా ఆడాడు. అయితే అక్కడ ఆశించిన మేర రాణించకపోవడంతో అతనికి అవకాశాలు దక్కలేదు. అతను పంజాబ్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున 26 మ్యాచ్‌ల్లో 153 పరుగులు, 18 వికెట్లు పడగొట్టాడు. 

 

>
మరిన్ని వార్తలు