IND VS SL 3rd ODI: క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి భారత్‌

15 Jan, 2023 09:37 IST|Sakshi

మూడో వన్డే బరిలో భారత్‌

నేడు శ్రీలంకతో చివరి పోరు 

మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

తిరువనంతపురం: భారత్, శ్రీలంక మధ్య టి20 సిరీస్‌లోనైనా ఫలితం చివరి మ్యాచ్‌ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో మాత్రం రెండో మ్యాచ్‌కే ఫలితం తేలిపోయింది. టీమిండియా 2–0తో సిరీస్‌ గెలుచుకోగా, చివరి పోరుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. మరో విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ భావిస్తుండగా, టి20ల తరహాలో కనీసం ఒక విజయంతోనైనా ముగించి పరువు నిలబెట్టుకోవాలని లంక కోరుకుంటోంది.  

మార్పు ఉంటుందా... 
‘అవసరమైతే తర్వాతి మ్యాచ్‌లో మార్పులు చేస్తాం’... రెండో వన్డే ముగిసిన తర్వాత భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. సిరీస్‌ ఇప్పటికే చేతికందడంతో స్వల్ప మార్పులతో రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించాలనేది ఆలోచన. గత రెండు మ్యాచ్‌లలోనూ అవకాశం దక్కకుండా అర్షదీప్, ఇషాన్‌ కిషన్, వాషింగ్టన్‌ సుందర్‌ బెంచీపై వేచి చూస్తున్నారు. వీరిలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. ముగ్గురికీ అవకాశం ఇవ్వాలనుకుంటే ఉమ్రాన్, రాహుల్, అక్షర్‌లను పక్కన పెట్టవచ్చు.

మరోవైపు భుజం నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన చహల్‌ పూర్తిగా కోలుకున్నాడు. అతడిని ఆడిస్తారా లేక రెండో వన్డే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్దీప్‌ యాదవ్‌ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. ఇతరత్రా భారత జట్టుకు ఎలాంటి సమస్యలు లేవు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లంతా ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ప్రధాన బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. వీరంతా తమ స్థాయికి తగినట్లు ఆడితే నిలువరించడం లంకకు చాలా కష్టమవుతుంది.  

నిసాంక పునరాగమనం... 
గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ను కాస్త ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను హోరాహోరీగా మార్చగలిగినా... శ్రీలంక అసలు సమస్య బ్యాటింగ్‌లోనే ఉంది. ఆశించిన స్థాయిలో కీలక ఆటగాళ్లు ప్రదర్శన ఇవ్వకపోవడంతో పేలవ స్కోరుకే పరిమితమైన జట్టు ఏమీ చేయలేకపోయింది. అందరికంటే సీనియర్‌ కుశాల్‌ మెండిస్‌ మరింత బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు చేయాల్సి ఉంది. గాయంతో రెండో వన్డేకు దూరమైన నిసాంక తిరిగి జట్టులోకి వస్తున్నాడు.

అతని స్థానంలో ఆడిన నువనిదు ఫెర్నాండో అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ సాధించడంతో పక్కన పెట్టలేని పరిస్థితి. దాంతో అసలంకను తప్పించవచ్చు. బౌలింగ్‌లో అంతంత మాత్రంగానే ఉన్న లంక భారత బ్యాటింగ్‌ను ఎంత వరకు నిలువరించగలదో చూడాలి. 

మరిన్ని వార్తలు