బుమ్రా వచ్చేశాడు...

13 Sep, 2022 03:55 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

హర్షల్‌ పటేల్‌ పునరాగమనం

రిజర్వ్‌ ఆటగాళ్లలో షమీ   

ముంబై: ఎలాంటి అనూహ్య, ఆశ్చర్యకర ఎంపికలు లేవు. అంచనాలకు అనుగుణంగానే బీసీసీఐ సెలక్టర్లు టి20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. ఇప్పటికే తామేంటో రుజువు చేసుకున్న టాప్‌ ఆటగాళ్లతో పాటు ఇటీవలి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఈ ఎంపిక జరిగింది. గాయాలతో కొంత కాలంగా టీమ్‌కు దూరమైన అగ్రశ్రేణి పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రాకతో భారత జట్టు బలం పెరిగింది.

గాయం నుంచి కోలుకున్న హర్షల్‌ పటేల్‌ కూడా పునరాగమనం చేయడం బౌలింగ్‌ను మరింత పదునుగా మార్చింది. రోహిత్‌ శర్మ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టుతో పాటు మరో నలుగురిని స్టాండ్‌బైలుగా సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌ జరుగుతుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తమ తొలి మ్యాచ్‌ బరిలోకి దిగే సమయం వరకు కూడా ఈ టీమ్‌లో మార్పులు చేసుకోవచ్చు. భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్‌ 23న పాకిస్తాన్‌తో తలపడుతుంది. 2021 టోర్నీలో భారత్‌ సెమీస్‌ చేరడంలో విఫలమైంది. తొలి ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో (2007) భాగంగా ఉన్న రోహిత్‌ శర్మ 15 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా టీమ్‌ను నడిపించనున్నాడు.  

హుడా, అశ్విన్‌లకు చాన్స్‌ 
ఆసియా కప్‌ ఫలితం ఎలా ఉన్నా, ఒకరిద్దరు తప్పితే మిగతా వారిని ప్రపంచకప్‌కు ఎంపిక చేసే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా... నిలకడైన ఆటతో ఆకట్టుకున్న దీపక్‌ హుడాకు చోటు లభించింది. ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ చేయగల అదనపు నైపుణ్యం కూడా అతనికి అవకాశం తెచ్చి పెట్టింది.

ప్రధాన స్పిన్నర్‌ చహల్‌ ఖాయం కాగా... రవీంద్ర జడేజా కోలుకునే అవకాశం లేకపోవడంతో అక్షర్‌ పటేల్‌కు సహజంగానే అవకాశం దక్కింది. అయితే మూడో స్పిన్నర్‌గా యువ లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్, సీనియర్‌ అశ్విన్‌ మధ్య పోటీ నడిచింది. అయితే ఆఫ్‌స్పిన్‌తో జట్టుకు వైవిధ్యం చేకూరడంతో పాటు ఆసీస్‌ గడ్డపై అపార అనుభవం ఉండటంతో సీనియర్‌ అశ్విన్‌కే ఓటు వేసిన సెలక్టర్లు... డెత్‌ ఓవర్లలో ఆకట్టుకుంటున్న పేసర్‌ అర్‌‡్షదీప్‌పై నమ్మకం ఉంచారు. 

12 ఏళ్ల తర్వాత...
వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ 12 ఏళ్ల తర్వాత మళ్లీ టి20 వరల్డ్‌కప్‌లో ఆడను న్నాడు. కార్తీక్‌ 2007, 2010లలో టి20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఆ తర్వాత నాలుగు వరల్డ్‌ కప్‌లు జరిగినా కార్తీక్‌కు స్థానం దక్కలేదు. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్‌ ఆడిన జట్టుతో పోలిస్తే ఇషాన్‌ కిషన్, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్‌ తమ స్థానాలు కోల్పోయారు. మరోవైపు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో స్టాండ్‌బైగా ఉన్న షమీని స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టి20 సిరీస్‌లకు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్‌ 20, 23, 25 తేదీల్లో... దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్‌ 28, అక్టోబర్‌ 2, 4 తేదీల్లో టీమిండియా టి20 సిరీస్‌ ఆడుతుంది.  

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), కోహ్లి, సూర్యకుమార్, దీపక్‌ హుడా, పంత్, దినేశ్‌ కార్తీక్, పాండ్యా, అశ్విన్, చహల్, అక్షర్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్‌ పటేల్, అర్‌‡్షదీప్‌ సింగ్‌. 
స్టాండ్‌బై: షమీ, అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్‌ చహర్‌. 

స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టి20 సిరీస్‌లలో కూడా స్వల్ప మార్పు మినహా ఇదే జట్టు బరిలోకి దిగుతుంది. హార్దిక్, భువనేశ్వర్‌ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు, అర్‌‡్షదీప్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరం కానున్నారు. రెండు సిరీస్‌ల సమయంలో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ మెరుగుదలకు సంబంధించి జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉంటారు. షమీ, దీపక్‌ చహర్‌ ఈ రెండు సిరీస్‌లు ఆడతారు.    

మరిన్ని వార్తలు