India Test Captain: ఏ బాధ్యత అయినా నెరవేరుస్తా.. కెప్టెన్సీ చేయాలని ఎవరు కోరుకోరు: మనసులో మాట చెప్పిన షమీ

27 Jan, 2022 18:57 IST|Sakshi

టీమిండియా టెస్టు కెప్టెన్‌ ఎవరు అన్న అంశంపై బీసీసీఐ ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. ఈ క్రమంలో ఇప్పటికే రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌ వంటి ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు... హిట్‌మ్యాన్‌ నియామకం ఖాయమే అన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను కూడా ఈ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నట్లు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ చెప్పకనే చెప్పాడు. కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే తప్పక స్వీకరిస్తానని మనసులో మాట బయటపెట్టాడు.

కాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. పేసర్లు బుమ్రా, షమీకి పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించేందుకు బీసీసీఐ వారిద్దరికి విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అన్ని ఫార్మాట్ల సిరీస్‌ల సెలక్షన్‌కు నేను అందుబాటులో ఉంటాను. నన్ను నేను నిరూపించుకోవాలని భావిస్తున్నాను. ఇక కెప్టెన్సీ విషయం గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు.

అయితే, నాకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నిజాయితీగా చెప్పాలంటే... టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వస్తే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు? మరోసారి చెబుతున్నా... నాకు ఏ పని అప్పజెప్పినా కచ్చితంగా వందశాతం న్యాయం చేస్తా’’ అని షమీ పేర్కొన్నాడు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో షమీ 14 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 

చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్‌ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్‌ తివారి

మరిన్ని వార్తలు