‘పసిడి’తో ముగింపు

29 Mar, 2021 03:30 IST|Sakshi
స్వర్ణాలతో శ్రేయసి, మనీషా, రాజేశ్వరి, లక్షయ్, పృథ్వీరాజ్, కైనన్‌ షెనాయ్‌ (ఎడమ నుంచి)

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌ ‘టాప్‌’

న్యూఢిల్లీ: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత షూటర్లు ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌ను స్వర్ణ పతకాలతో ముగించారు. టోర్నీ చివరి రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం లభించాయి. ఓవరాల్‌గా భారత్‌ 15 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 30 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్‌ టోర్నీ ల చరిత్రలో ఒకే ఈవెంట్‌లో ఒక దేశానికి 15 స్వర్ణాలు రావడం ఇదే ప్రథమం. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో గుర్‌ప్రీత్‌ సింగ్, విజయ్‌వీర్‌ సిద్ధూ, ఆదర్శ్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు 2–10తో సాండెర్సన్, హాబ్సన్, టర్నర్‌లతో కూడిన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది.

మహిళల ట్రాప్‌ ఈవెంట్‌ ఫైనల్లో శ్రేయసి, రాజేశ్వరి, మనీషాలతో కూడిన భారత జట్టు 6–0తో మరియా, ఐజాన్, సర్సెన్‌కుల్‌లతో కూడిన కజకిస్తాన్‌ జట్టును ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్, పృథ్వీరాజ్, లక్షయ్‌లతో కూడిన భారత పురుషుల ట్రాప్‌ జట్టు టీమ్‌ ఫైనల్లో 6–4తో స్లామ్‌కా, అడ్రియన్, మరినోవ్‌లతో కూడిన స్లొవేకియా జట్టుపై గెలిచి స్వర్ణాన్ని నెగ్గింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం 8 పతకాలతో అమె రికా రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో 53 దేశాల నుంచి 294 మంది షూటర్లు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు