నవంబర్‌ 27న తొలి పోరు

29 Oct, 2020 05:09 IST|Sakshi
ఆస్ట్రేలియా, భారత వన్డే జట్టు కెప్టెన్లు ఫించ్, కోహ్లి (ఫైల్‌)

ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటన అధికారికంగా ఖరారు

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా బరిలోకి

అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి డే–నైట్‌ టెస్టు   

భారత క్రికెట్‌ జట్టు చివరిసారిగా మార్చి 2న మైదానంలోకి దిగింది. న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌ ఓడిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉన్నా... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులై
పోయింది. బయో బబుల్‌లో ఐపీఎల్‌ వినోదం పంచుతున్నా... సగటు భారత అభిమాని అంతర్జాతీయ క్రికెట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగే టీమిండియా పర్యటన అధికారికంగా ఖరారైంది. మూడు ఫార్మాట్‌లలో కలిపి 10 మ్యాచ్‌లతో ఈ పోరు రసవత్తరంగా సాగడం ఖాయం. కోవిడ్‌–19 కఠిన పరిస్థితులను అధిగమించి సరిగ్గా 269 రోజుల విరామం తర్వాత భారత జట్టు సిడ్నీ వేదికగా నవంబర్‌ 27న జరిగే తొలి వన్డేతో మళ్లీ బరిలోకి దిగనుంది.   

మెల్‌బోర్న్‌: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీమిండియా సుదీర్ఘ ఆసీస్‌ టూర్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కరోనా పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలతో చర్చించిన తర్వాత తమ అంగీకారాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ)కు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. గతంలోనే షెడ్యూల్‌ ప్రకటించేందుకు సీఏ సిద్ధమైనా... ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు స్వల్ప మార్పులతో మొత్తం పర్యటన వివరాలను సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కేవలం 14 కేసులు మాత్రమే నమోదు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య సుమారు 1500 మాత్రమే. ఈ సిరీస్‌లో భారత్‌–ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు జరుగుతాయి.

మెల్‌బోర్న్‌లో రోజూ 25 వేల ప్రేక్షకులకు అనుమతి!
నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకు అడిలైడ్‌ వేదిక కానుంది. ఇది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి డే అండ్‌ నైట్‌ కావడం విశేషం. భారత్‌ తమ ఏకైక డే–నైట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించగా... ఆసీస్‌ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు, ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు రోజుల డే అండ్‌ నైట్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తలపడుతుంది. ఆసీస్‌ ‘ఎ’ జట్టులో కూడా దాదాపు అంతా ప్రధాన జట్టు ఆటగాళ్లే ఉండే అవకాశం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా బాక్సింగ్‌ డే టెస్టుకు మెల్‌బోర్న్‌ మైదానమే వేదిక కానుంది. అయితే విక్టోరియా రాష్ట్రంలోనే కరోనా ప్రభావం ఉండటంతో  లక్ష సామర్థ్యం గల ఈ స్టేడియంలో రోజూ నాలుగో వంతు సుమారు 25 వేల మంది ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని సీఏ పరిశీలిస్తోంది. మరోవైపు భారత క్రికెటర్లు కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో సీఏ, బీసీసీఐతో చర్చిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.      

14 రోజుల క్వారంటైన్‌...
బీసీసీఐ ఎన్ని విధాలా విజ్ఞప్తి చేసినా క్వారంటైన్‌ విషయంలో మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం క్రికెటర్లకు ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంగా చెప్పింది. నవంబర్‌ 10న దుబాయ్‌లో ఐపీఎల్‌ ముగిసిన అనంతరం భారత బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి బయలుదేరి వెళుతుంది. నిజానికి భారత్‌ ముందుగా బ్రిస్బేన్‌ వెళ్లాల్సి ఉన్నా, క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించలేదు. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌కు దగ్గరిలోనే ఒక హోటల్‌లో వీరికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్‌ను ఇతర       అతిథులు ఎవరూ ఉండకుండా ప్రత్యేకంగా టీమిండియా కోసం సిద్ధం చేశారు. ఆటగాళ్లంతా నవంబర్‌ 12 నుంచి హోటల్‌లోనే 14 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలోనే ఉన్న బ్లాక్‌టౌన్‌లో టీమ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంది. క్వారంటైన్‌ ముగిసిన సరిగ్గా రెండు రోజుల తర్వాత టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

మరిన్ని వార్తలు