India Tour of England: కామెంటరీ ప్యానెల్‌ ఇదే.. మరో క్రికెట్‌ జట్టును తలపిస్తుందిగా!

22 Jun, 2022 19:01 IST|Sakshi

క్రికెట్‌ ఆటలో మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు.. అంపైర్లు.. బంతి.. బ్యాట్‌ ఉంటే (వెలుతురు కూడా ఉండాలనుకోండి) మ్యాచ్‌కు ఏ ఆటంకం ఉండదు. మ్యాచ్‌ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు లైవ్‌లో ఆస్వాధిస్తారు. మ్యాచ్‌కు వెళ్లలేని అభిమానులు కూడా ఉంటారుగా. మరి వారి కోసం టీవీల్లో పలు స్పోర్ట్స్‌ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అయితే లైవ్‌లో మ్యాచ్‌ చూసే ప్రేక్షకులకు.. ఇంట్లో టీవీలో చూసే ప్రేక్షకుల మధ్య ఒక చిన్న అంతరం ఉంటుంది. ఆ అంతరం ఏంటో ఈపాటికే మీకు అర్థమయి ఉంటుంది.. అదే క్రికెట్‌ కామెంటరీ .

మన చిన్నప్పడు అంటే టీవీలు రాకముందు.. రేడియోలు ఉన్న కాలంలో చాలా మంది అభిమానులు స్కోర్‌తో పాటు క్రికెట్‌ కామెంటరీ వింటూ ఉండేవారు. అలా క్రికెట్‌తో పాటు కామెంటరీకి కూడా సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఏర్పడింది. టీవీల్లో కామెంటరీని వింటూనే మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లను ఎంజాయ్‌ చేస్తుంటాం. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. జూలై, ఆగస్టు నెలల్లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. మరి ఈ మ్యాచ్‌లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న స్టార్‌స్పోర్ట్స్‌ యాజమాన్యం కూడా తమ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ ప్యానెల్‌లో హిందీ, ఇంగ్లీష్‌ కామెంటేటర్లు ఉన్నారు. 

ఇంగ్లీష్‌లో కామెంటరీ చేయనున్నవాళ్లు: హర్షా బోగ్లే, నాసర్‌ హుస్సేన్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, గ్రేమ్‌ స్వాన్‌, డేవిడ్‌ గ్రోవర్‌, మైకెల్‌ ఆర్థర్‌ టన్‌
హిందీలో కామెంటరీ చేయనున్నవాళ్లు: వివేక్‌ రజ్దన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, అజయ్‌ జడేజా, సాబా కరీమ్‌, మహ్మద్‌ కైఫ్‌, ఆశిష్‌ నెహ్రా, అజిత్‌ అగార్కర్‌

ఈ 13 మందిలో హర్షా బోగ్లేను మినహాయిస్తే మిగతా 12 మంది ఏదో ఒక దశలో క్రికెట్‌ ఆడినవారే. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంటరీ ప్యానల్‌ను సరదాగా ట్రోల్‌ చేశారు. ''ఇంగ్లండ్‌, ఇండియాల జట్ల కంటే ఈ కామెంటరీ ప్యానెల్‌ పటిష్టంగా కనిపిస్తోంది.. 12 మంది ఆటగాళ్లు ఉన్నారు.. అందులో బ్యాటర్స్‌, బౌలర్స్‌ ఉండడంతో మరో క్రికెట్‌ జట్టును తలపిస్తోంది. వీళ్లకు కూడా ఒక మ్యాచ్‌ నిర్వహించండి'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరగనున్న ఏకైక టెస్టుకు అంతా సిద్ధమయింది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది.  

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ 

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌ ..
జూన్‌ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌
జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌, ఎడ్జ్‌బాస్టన్‌
జులై 7న తొలి టీ20, సౌతాంప్టన్
జులై 9న రెండో టీ20, బర్మింగ్‌హామ్ 
జులై 10న మూడో టీ20, నాటింగ్‌హామ్
జులై 12న తొలి వన్డే, లండన్
జులై 14న రెండో వన్డే, లండన్
జులై 17న మూడో వన్డే, మాంచెస్టర్

చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్‌ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'

టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం!

మరిన్ని వార్తలు