IND Vs ENG Test Series: వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సిరీస్‌ ఇదే

27 Aug, 2021 17:34 IST|Sakshi

లీడ్స్‌: భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌.. వీక్షకుల(వ్యూయ‌ర్‌షిప్) పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గ‌త మూడేళ్ల‌లో టీమిండియా ఆడిన‌ విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌ల‌లో అత్య‌ధిక వ్యూయ‌ర్‌షిప్ ఈ సిరీస్‌కే వ‌చ్చిన‌ట్లు సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌ వెల్ల‌డించింది. 2018 ఇంగ్లండ్‌ పర్యటనతో పోలిస్తే ఈ సిరీస్‌ స‌గ‌టు వ్యూయ‌ర్‌షిప్ 30 శాతం పెరిగిన‌ట్లు సదరు సంస్థ ప్రకటించింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్ చివ‌రి రోజు ఆట‌కు ఏకంగా 70 శాతం వ‌ర‌కూ రేటింగ్స్ పెరిగినట్లు పేర్కొంది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుంద‌న్న అంచ‌నాతో ఆఖరి రోజు ఆటను భారీగా వీక్షించినట్లు తెలిపింది. 

ఈ మ్యాచ్‌ ఆఖరి రోజు సుమారు 80 ల‌క్ష‌ల ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయని, భారత జట్టు విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వ‌చ్చిన అత్య‌ధిక ఇంప్రెష‌న్స్ ఇవేనని ఛానెల్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా గెలుపు త‌ర్వాత తమ ఛానెల్‌కు మ‌రిన్ని బ్రాండ్లు క్యూ క‌ట్టాయని వారు తెలిపారు. కాగా, భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌కు ఇప్ప‌టికే 12 అంతర్జాతీయ బ్రాండ్లు స్పాన్స‌ర్లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 4న ప్రారంభ‌మైన ఈ సిరీస్‌లో ప్రస్తుతం మూడో టెస్ట్ జ‌రుగుతుండగా, మ‌రో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది. 
చదవండి: ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా పక్షవాతం బారిన పడ్డ దిగ్గజ ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు