India Tour of South Africa: దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా.. ఈసారైనా కల నెరవేరేనా?

16 Dec, 2021 08:25 IST|Sakshi
PC: BCCI

India Vs South Africa Test Series: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టెస్టు జట్టు ప్రొటిస్‌తో తలపడేందుకు గురువారం(డిసెంబరు 16) ఉదయం సౌతాఫ్రికాకు పయనమైంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి భయాల నేపథ్యంలో బీసీసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ... ప్రత్యేక చార్టర్‌ ఫ్లైట్‌లో ఆటగాళ్లను అక్కడికి పంపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 

కాగా జొహన్నస్‌బర్గ్‌ చేరుకోగానే టీమిండియా ఒకరోజు ఐసోలేషన్‌లో గడపనుంది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు మూడు సార్లు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో నెగటివ్‌ ఫలితం వస్తే బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌లోకి వాళ్లను పంపనున్నారు. ఇక ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్ల కుటుంబ సభ్యులందరినీ అక్కడికి అనుమతించలేదు. 

అయితే కెప్టెన్‌ కోహ్లి మాత్రం తన గారాల పట్టి వామికా మొదటి పుట్టినరోజు నేపథ్యంలో సతీమణి అనుష్క శర్మ, కూతురిని వెంట వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సెంచూరియన్‌ వేదికగా డిసెంబరు 26 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.  ఇక ఇప్పటి వరకు సఫారీ గడ్డపై 7 టెస్టు సిరీస్‌లు ఆడిన టీమిండియా ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. ఈసారి ఎలాగైనా సిరీస్‌ గెలిచి ఆ అపఖ్యాతిని చెరిపేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది.

చదవండి: నన్ను తొలగించడానికి అదో కారణం కావచ్చు: విరాట్‌ కోహ్లి

>
మరిన్ని వార్తలు