IND vs ZIM: ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా..!

8 Jul, 2022 20:14 IST|Sakshi

టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌ ఆగస్ట్ 18 నుంచి 22 వరకు జరగనుంది. ఈ విషయాన్ని జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించారు. ప్రపంచ స్థాయి భారత ఆటగాళ్లతో తలపడే ఈ సిరీస్‌ జింబాబ్వే క్రికెటర్‌లకు గొప్ప అవకాశం అని రాజ్‌పుత్ తెలిపాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌ జింబాబ్వే క్రికెట్‌కు మంచి చేస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. ఇక పర్యటన గురించి  జింబాబ్వే క్రికెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. "భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నాము.

అదే విధంగా ఈ చిరస్మరణీయ సిరీస్ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము" అని పేర్కొన్నాడు. ఇక భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌ అనంతరం టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. విండీస్‌ టూర్‌లో భారత్‌ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత  జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి శ్రీలంక వేదికగా ఆసియా కప్‌ జరగనుండంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది. ఇక చివర సారిగా 2016లో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
చదవండిMalaysia Masters: ముగిసిన పీవీ సింధు పోరాటం.. మళ్లీ తైజు చేతిలో ఓటమి

మరిన్ని వార్తలు