జోరుగా కోహ్లి, రోహిత్‌, రహానే ప్రాక్టీస్‌

2 Mar, 2021 04:49 IST|Sakshi

ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు భారత్‌ సన్నాహాలు 

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు తమ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఆదివారం స్వల్పంగా ప్రాక్టీస్‌ చేసిన టీమిండియా ఆటగాళ్లు సోమవారం కూడా కఠోర సాధన చేశారు. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అజింక్య రహానే సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో తమ బ్యాట్‌లకు పదును పెట్టారు. ఈ ముగ్గురు పేస్, స్పిన్‌ బౌలింగ్‌లో అన్ని రకాల షాట్లను ఆడుతున్న వీడియోను బీసీసీఐ పోస్ట్‌ చేసింది. ప్రాక్టీస్‌ సెషన్‌ను పర్యవేక్షించిన హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆటగాళ్లకు పలు సూచనలిచ్చారు. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా విరామం లేకుండా బౌలింగ్‌ చేయగా... కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ నేతృత్వంలో ఆటగాళ్లు స్లిప్‌ ఫీల్డింగ్‌పై దృష్టి పెడుతూ సాధనలో పాల్గొన్నారు. 

మళ్లీ స్పిన్‌ పిచ్‌!
మూడో టెస్టు పిచ్‌ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని  బీసీసీఐ భావిస్తోంది. ఈనెల 4 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ కోసం మరోసారి స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేసి ఇంగ్లండ్‌ పని పట్టాలని కోరుకుంటోంది. బోర్డు సూచనలకు అనుగుణంగా చివరి టెస్టుకు కూడా స్పిన్‌ పిచ్‌నే అందుబాటులో ఉంచవచ్చు. ‘మారేది బంతి రంగు మాత్రమే, పిచ్‌ కాదు. అయినా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లేందుకు అవసరమైన కీలక టెస్టు ఇది. ఈ అవకాశాన్ని భారత్‌ ఎందుకు చేజార్చుకోవాలి. బ్యాటింగ్‌కు అనుకూలంగా తయారు చేసి ఇంగ్లండ్‌ కోలుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి’ అని బోర్డు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు