IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోహిత్‌ దూరం! ఓపెనర్‌గా కిషన్‌? తుది జట్టు ఇదే

16 Mar, 2023 16:32 IST|Sakshi

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో అమీతుమీ తెల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. టెస్టు సిరీస్‌ ఫలితాన్నే పునరావృతం చేసి వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని భారత్‌ భావిస్తుంటే..  టెస్టు సిరీస్‌ ఓటమికి ప్రతీకారం​ తీర్చుకోవాలని ఆసీస్‌ వ్యూహాలు రచిస్తోంది.

ముంబై వేదికగా శుక్రవారం(మార్చి17) జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే తొలి వన్డేకు టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్యా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. తొలి వన్డేకు రోహిత్‌ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ప్రారంభించడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది.

మరోవైపు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌తో వన్డేల్లో పునరాగమనం చేయనున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి వన్డే జడేజా ఆడనున్నాడు. ఇక జడ్డూ జట్టు సెలక్షన్‌కు అందుబాటులోకి రావడంతో మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఇద్దరిలో ఎవరో ఒక్కరికే చోటు దక్కే అవకాశం ఉంది.

చాహల్‌ను కాదని కుల్దీప్‌వైపే జట్టు మెనెజెమెంట్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. గాయం కారణంగా ఆఖరి రెండు టెస్టులకు దూరమైన స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తిరిగి జట్టుతో చేరాడు. అదే విధంగా ఈ సిరీస్‌కు ఆసీస్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ దూరం కావడంతో స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహించను​న్నాడు.

తుది జట్లు(అంచనా)
భారత్‌: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్‌ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. సచిన్‌ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి

మరిన్ని వార్తలు