సిరేసులో ఉండాలంటే...

29 Nov, 2020 01:15 IST|Sakshi
ఫించ్, జంపా, వార్నర్‌

నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ రెండో వన్డే

గెలిస్తేనే సిరీస్‌ ఆశలు సజీవం

ఒత్తిడిలో కోహ్లి బృందం

ఉదయం గం. 9:10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఇప్పుడు కోహ్లి బృందం కూడా అదే చేయాలి. సిడ్నీలో ఎదురైన ఓటమికి... ఈ సిడ్నీలోనే విజయంతో ఆసీస్‌కు సమాధానం ఇవ్వాలి. అప్పుడే సిరీస్‌లో ఉంటాం. లేదంటే క్లీన్‌స్వీప్‌ దారిలో పడిపోతాం.

సిడ్నీ: తొలి వన్డే ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ఇప్పుడు రేసులో నిలిచే పనిలో పడింది. ఇక్కడే జరిగే రెండో వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్‌ పొట్టి ఫార్మాట్‌ నుంచి, గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి తొందరగా బయటపడాలని కోహ్లి సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వరుస విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌... ఆల్‌రౌండ్‌ సత్తాతో పర్యాటక జట్టును మళ్లీ కంగారు పట్టించేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం రెండో వన్డే జరుగుతుంది.  

కోహ్లి ఫామ్‌పైనే కలవరం...
ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి చక్కగా రాణించిన సందర్భాలున్నాయి. కానీ ప్రత్యేకించి ఇక్కడి సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ)లో అతని ఆటతీరు పేలవం. ఇక్కడ అతని టాప్‌ స్కోరు 21 పరుగులే. గత మ్యాచ్‌లో అదేస్కోరును సమం చేశాడంతే! సగటైతే 11.40 పరుగులే. ‘టన్‌’లకొద్దీ పరుగులు బాదిన ఈ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌కు ఎస్‌సీజీ అంతుచిక్కడం లేదు. ఆదివారం భారత కెప్టెన్‌ నిలబడినా, రాణించినా గత విశ్లేషణలన్నీ మారుతాయి. విజయం కూడా దక్కుతుంది. ఓపెనర్‌ మయాంక్‌ ఐపీఎల్‌లో అదరగొట్టాడు. ఇక్కడ అదేపని చేస్తే... మరో ఓపెనర్‌ ధావన్‌ ఫామ్‌లో ఉండటంతో చక్కని ఆరంభమే కాదు భారీ భాగస్వామ్యం నమోదు చేయొచ్చు. ఆ తర్వాత కోహ్లితో పాటు మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ బ్యాట్‌కు పనిచెబితే పరుగుల వరద పారుతుంది. హార్దిక్‌ పాండ్యా చాలా రోజుల తర్వాత వన్డే ఆడినా... తొలి మ్యాచ్‌తోనే ఫామ్‌ కనబరిచాడు. ఇది జట్టుకు సానుకూలాంశం.

ఫిట్‌గానే చహల్‌...
స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ తొలి వన్డే ఆడుతూ స్వల్ప గాయంతో మైదానం వీడినా... తన 10 ఓవర్ల కోటా పూర్తి చేశాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై జట్టుకు ఎలాంటి కలవరం లేదు. అయితే గత మ్యాచ్‌లో అతనితో పాటు బుమ్రా, సైనీ ధారాళంగా సమర్పించుకున్న పరుగులతోనే జట్టు మేనేజ్‌మెంట్‌ ఆందోళన పడుతోంది. సీమర్లకు అనుకూలమైన పిచ్‌లపై బుమ్రా విఫలమవడమే కాస్త ఇబ్బందికర పరిణామం. అయితే రెండో వన్డేలో అతను కుదుటపడితే ఆ ఇబ్బందులు ప్రత్యర్థి జట్టుకు బదిలీ చెయొచ్చు. కొత్త బౌలర్‌ నటరాజన్‌కు అవకాశమివ్వాలని భావిస్తే సైనీని పక్కనబెట్టే అవకాశాలున్నాయి.

జోరు మీదున్న ఆసీస్‌...
భారత బౌలింగ్‌ను చితగ్గొట్టిన బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌తో, శతక భాగస్వామ్యాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. ఇది ఇలాగే కొనసాగించి ఇక్కడే సిరీస్‌ గెలుచుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఫించ్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వార్నర్, ఫించ్, స్మిత్‌ల ప్రదర్శన ఆతిథ్య జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ అందుబాటులో ఉన్నాడు. దీంతో అతని అరంగేట్రం దాదాపు ఖాయమైంది. సొంతగడ్డపై పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌లది ఎప్పుడైనా పైచేయే! ఆతిథ్య అనుకూలతలు వారిని ఓ మెట్టుపైనే నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్పిన్నర్‌ జంపా గత మ్యాచ్‌లో భారత వెన్నువిరిచాడు. కీలక బ్యాట్స్‌మెన్‌నే కాదు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ను కూడా తన స్పిన్‌ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేశాడు.

పిచ్, వాతావరణం
గత మ్యాచ్‌లాగే పరుగుల వరద పారే పిచ్‌. బ్యాట్స్‌మెన్‌ నిలబడితే చాలు... భారీస్కోర్లు రిపీట్‌ అవుతాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా