ప్రాక్టీస్‌ ప్రతిఫలం మనకే

14 Dec, 2020 04:17 IST|Sakshi

ఆస్ట్రేలియా ‘ఎ’తో రెండో వార్మప్‌ మ్యాచ్‌ కూడా ‘డ్రా’నే

మెక్‌డెర్మట్, విల్డర్‌ముత్‌ అజేయ శతకాలు

ఇక టెస్టులకు రెడీ అంటున్న భారత్‌

కోహ్లి తప్ప అందరూ బరిలోకి దిగారు.  ఒకరిద్దరు మినహా అంతా బాగా ఆడారు. డే–నైట్‌ టెస్టుకు ముందు కావాల్సినంత ప్రాక్టీస్‌ ఈ డే–నైట్‌ వార్మప్‌ మ్యాచ్‌తో వచ్చేసింది.  అంతకుమించి భారత్‌కు క్లారిటీ ఇచ్చిన మ్యాచ్‌ కూడా ఇదే! ఓపెనింగ్‌ నుంచి సీమర్ల దాకా తుది జట్టులో ఎవరిని ఎంపిక చేయొచ్చో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు స్పష్టతనిచ్చింది. ఇక ఈ పర్యటనలో మిగిలున్న ‘టెస్టు’లకు భారత్‌ సై అంటోంది.  
సిడ్నీ: ఆఖరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మెన్‌ శతక్కొట్టి ఉండవచ్చు... తుదకు మ్యాచ్‌ ‘డ్రా’ అయిండొచ్చు... కానీ ఓవరాల్‌గా బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. ఈ మ్యాచ్‌ జట్టు కూర్పునకు దోహదం చేసింది. లయతప్పిన పంత్‌ను ఫామ్‌లోకి తెచ్చింది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ చక్కని ప్రత్యామ్నాయం అనిపించింది. విహారిని అక్కరకొచ్చే పార్ట్‌టైమ్‌ బౌలర్‌ (స్పిన్‌)గా, మిడిలార్డర్‌లో దీటైన బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది.

ఇక మ్యాచ్‌ పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ కూడా ‘డ్రా’ ఫలితాన్నే ఇచ్చింది. ఆఖరి రోజు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ) పూర్తిగా బ్యాటింగ్‌ వికెట్‌గా మారింది. దీంతో భారత బౌలర్ల శ్రమంతా నీరుగారింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో బెన్‌ మెక్‌డెర్మట్‌ (107 నాటౌట్‌; 16 ఫోర్లు), జాక్‌ విల్డర్‌ముత్‌ (111 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకాలతో నిలబడ్డారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది.  

‘కంగారూ’ పెట్టిన ఆరంభం...
భారత్‌ క్రితం రోజు స్కోరు వద్దే డిక్లేర్‌ చేసింది. దీంతో చివరి రోజు 473 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ను భారత్‌ పేసర్లు షమీ (2/58), సిరాజ్‌ (1/54) వణికించారు. ఓపెనర్లు హారిస్‌ (5), బర్న్స్‌ (1), వన్‌డౌన్‌లో మ్యాడిన్సన్‌ (14)లను భారత సీమ్‌ ద్వయం పడేసింది. అలా టాపార్డర్‌ను 25 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో మెక్‌డెర్మట్, కెప్టెన్‌ అలెక్స్‌ క్యారీ (111 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.

పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతోపాటే మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ పిచ్‌ కూడా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైంది. ఎస్‌సీజీ సహజంగానే బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో భారత బౌలర్ల వ్యూహాలు పనిచేయలేదు. మెక్‌డెర్మట్, క్యారీ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించాక క్యారీని హనుమ విహారి బోల్తా కొట్టించాడు. 142 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌ ఆ తర్వాత మరో వికెట్‌నే చేజార్చుకోలేదు. విల్డర్‌ముత్‌ వన్డేను తలపించేలా బ్యాటింగ్‌ చేశాడు. పిచ్‌ సానుకూలతల్ని సద్వినియోగం చేసుకున్న అతను భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.  

ఇది సరే... కానీ!
ఆస్ట్రేలియా ‘ఎ’ బ్యాట్స్‌మన్‌ ఆఖరి రోజు అదరగొట్టారు. అజేయ సెంచరీలు సాధించారు. అయితే ఈ ఉత్సాహమేది ఆతిథ్య జట్టును ఊరడించలేదు. ఎందుకంటే గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు ఇదేమాత్రం కలిసొచ్చే అంశం కాదు. ప్రధానంగా ఓపెనింగ్‌ సమస్య ఆసీస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వార్నర్‌ పూర్తిగా కోలుకోలేదు. యువ ఓపెనర్‌ పకోవ్‌స్కీ కన్‌కషన్‌ అయ్యాడు. ఇతని స్థానంలో ఆడిన హారిస్‌ విఫలమయ్యాడు. జో బర్న్స్‌ అయితే నిరాశపరిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు ఇపుడు ఓపెనర్ల సమస్య కాదు... ఓపెనర్లే కరువైన సమస్య వచ్చిపడింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 194
ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 108

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 386/4 డిక్లేర్డ్‌
ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) పృథ్వీ షా (బి) షమీ 5; బర్న్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 1; మ్యాడిన్సన్‌ (సి)సైనీ (బి) సిరాజ్‌ 14; మెక్‌డెర్మట్‌ (నాటౌట్‌) 107; క్యారీ (సి) సబ్‌–కార్తీక్‌ త్యాగి (బి) విహారి 58; విల్డర్‌ముత్‌ (నాటౌట్‌) 111
ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (75 ఓవర్లలో 4 వికెట్లకు) 307.

వికెట్ల  పతనం: 1–6, 2–11, 3–25, 4–142.

బౌలింగ్‌: షమీ 13–3–58–2, బుమ్రా 13–7–35–0, సిరాజ్‌ 17–3–54–1, సైనీ 16–0–87–0, హనుమ విహారి 7–1–14–1, మయాంక్‌ అగర్వాల్‌ 6–0–30–0, పృథ్వీ షా 3–0–26–0.  


మెక్‌డెర్మట్‌, విల్డర్‌ముత్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు