IND vs AUS 2nd T20: సిరీస్‌ కాపాడుకునేందుకు...

23 Sep, 2022 04:08 IST|Sakshi

ఆస్ట్రేలియాతో భారత్‌ పోరు

నేడు రెండో టి20 

రోహిత్‌ సేనపై ఒత్తిడి 

రా.గం.7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

నాగ్‌పూర్‌: రేసులో నిలవాలంటే... హైదరాబాద్‌లో సిరీస్‌ను తేల్చుకోవాలంటే... టీమిండియా ఇక్కడ ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్‌ ఓటమితో వెనుకబడిన రోహిత్‌ సేన శుక్రవారం జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన కంగారూ సేన వరుస విజయాలతో ఏకంగా సిరీస్‌పైనే కన్నేసింది.

ఈ నేపథ్యంలో నాగపూర్‌లో సమరం ఆసక్తికరంగా మారింది. పొట్టి ఫార్మాట్‌లో కచ్చితమైన ఫేవరెట్, సొంతగడ్డ అనుకూలతలేవీ ఉండవు. ఎవరు మెరిపిస్తే ఆ జట్టే గెలుస్తుంది. ఇక్కడ బంతికంటే బ్యాట్‌ ఆధిపత్యమే కొనసాగుతుంది. గత మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. కారణం చేజింగ్‌లో మనకన్న ప్రత్యర్థి మెరుపులే మెరిశాయి.  

డెత్‌ ఓవర్లపైనే దృష్టి
ఒత్తిడంతా ఆతిథ్య భారత జట్టుపైనే ఉంది. బ్యాటింగ్‌ బాగున్నా... బౌలింగ్‌ ఆందోళన పెంచుతోంది. డెత్‌ ఓవర్లు మన భారీ స్కోరును సులభంగా ఛేదించేలా చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 33 మంది బౌలర్లు 20 డెత్‌ ఓవర్లు వేశారు. సగటున ప్రతి ఒక్కరు ఓవర్‌కు 10 పరుగులకంటే ఎక్కువే ఇచ్చారు. కలవరపెడుతున్న గణాంకాల నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా ప్రత్యేకించి బౌలింగ్‌ విభాగంపైనే దృష్టి సారించింది.

పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్న బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించే ప్రయత్నం చేయొచ్చు. బ్యాటింగ్‌ దళం పటిష్టంగానే ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఆసియా కప్‌తో ఫామ్‌లోకి వచ్చారు. సూర్యకుమార్‌ తన పాత్రకు న్యాయం చేయగా, హార్దిక్‌ పాండ్యా తన బ్యాటింగ్‌ సత్తాను చుక్కలతో చూపించాడు. ఇదే జోరు నాగ్‌పూర్‌లోనూ కొనసాగితే భారత్‌ భారీస్కోరుకు తిరుగుండదు.

ఉత్సాహంగా కంగారూ సేన
శుభారంభం తాలుకు ఉత్సాహం పర్యాటక జట్టులో తొణికిసలాడుతోంది. టి20 ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్‌కు ముందు ఈ సిరీస్‌ను తీసుకెళ్లాలని ఆశిస్తోంది. మొహాలిలో ఆసీస్‌ బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ క్రీజులోకి దిగిన బ్యాట్స్‌మెన్‌లో ఒక్క మ్యాక్స్‌వెల్‌ (1) మినహా అందరు వేగంగానే పరుగులు చేశారు.

ఫించ్‌ (13 బంతుల్లో 22), గ్రీన్‌ (30 బంతుల్లో 61), ఇంగ్లిస్‌ (10 బంతుల్లో 17), వేడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌) ఇలా అందరూ బ్యాట్‌కు పనిచెప్పడంతో ఆతిథ్య బౌలింగ్‌ చెదిరింది. కొండంత లక్ష్యం చకచకా కరిగిపోయింది. అయితే బౌలింగ్‌కు సహకరించే నాగ్‌పూర్‌ పిచ్‌పై పరుగుల మోత ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వేదికపై 12 టి20 మ్యాచ్‌లు జరిగితే మొదట బ్యాటింగ్‌ జట్టు చేసిన సగటు స్కోరు 151 పరుగులే! ఈ నేపథ్యంలో ఇక్కడ బ్యాటే కాదు బంతి కూడా ప్రభావం చూపుతుంది.

మరిన్ని వార్తలు