India vs Australia 3rd T20: సిరీస్‌ ‘భాగ్యం' ఎవరిదో!

25 Sep, 2022 04:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్‌ క్లైమాక్స్‌కు చేరింది. పరుగుల వరద పారిన తొలి పోరులో ఆసీస్‌ పైచేయి సాధించగా, ఎనిమిది ఓవర్ల తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ ఫటాఫట్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్‌ భావిస్తుండగా, టి20 వరల్డ్‌ కప్‌ ఆతిథ్య జట్టు సిరీస్‌ నెగ్గి స్వదేశం చేరాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియం సమరం మరింత ఆసక్తికరంగా మారింది. భాగ్యనగరంలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. హైదరాబాద్‌ పిచ్‌ అన్ని విధాలా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది కాబట్టి పరుగుల వరద ఖాయం. 2019 డిసెంబర్‌ 6న రాజీవ్‌గాంధీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్‌ మధ్య ఆఖరిసారిగా జరిగిన అంతర్జాతీయ టి20లో మొత్తం 416 పరుగులు నమోదయ్యాయి.  

మళ్లీ భువనేశ్వర్‌...
ఎనిమిది ఓవర్లకే పరిమితమైన గత మ్యాచ్‌లో భారత్‌ పూర్తి బలాబలాలు పరీక్షించలేకపోయింది. బ్యాటింగ్‌ను పటిష్టం చేసేందుకు పేసర్‌ భువనేశ్వర్‌ స్థానంలో జట్టులోకి పంత్‌ను తీసుకున్నా అతనికి బ్యాటింగ్‌ అవకాశమే రాలేదు. అయితే గరిష్టంగా ఒక బౌలర్‌ రెండు ఓవర్లే వేయడంతో ఐదో బౌలర్‌ విషయంలో సమస్య రాలేదు. కానీ పూర్తి స్థాయి మ్యాచ్‌లో అలా సాధ్యం కాదు కాబట్టి భువ నేశ్వర్‌ మళ్లీ జట్టులోకి రావడం ఖాయం. బుమ్రా తన స్థాయికి తగినట్లుగా అద్భుతంగా బౌలింగ్‌ చేయడం సానుకూలాంశం కాగా, మ్యాచ్‌ మ్యాచ్‌ కూ మెరుగవుతున్న అక్షర్‌ పటేల్‌ మరో చక్కటి ప్రదర్శన కనబర్చాడు.

అయితే వరల్డ్‌కప్‌కు ముందు హర్షల్‌ పటేల్, చహల్‌ బౌలింగ్‌ భారత్‌ను ఆందోళన పెడుతోంది. చహల్‌ వికెట్లు తీయలేకపోగా, హర్షల్‌ ధారాళంగా పరుగులిస్తున్నాడు. రెండు మ్యాచ్‌ల లోనూ విఫలమైన హర్షల్‌కు మరో అవకాశం ఇస్తారా లేక దీపక్‌ చహర్‌తో ప్రయత్నిస్తారా చూడాలి. బ్యాటింగ్‌కు సంబంధించి భారత్‌ మెరుగైన స్థితి లో ఉంది. నాగపూర్‌లో రోహిత్‌ ఆడిన షాట్లు చూస్తే అతను ఎంత ప్రమాదకర బ్యాటరో తెలుస్తుంది. రాహుల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ రాణించడం కీలకం. హార్దిక్‌ బ్యాటింగ్‌ మెరుపులు తొలి టి20లో కనిపించగా... కార్తీక్‌ మరోసారి తన ఫిని షర్‌ పాత్రకు గత మ్యాచ్‌లో న్యాయం చేకూర్చాడు.  

బౌలింగ్‌ సమస్యలు...
పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ఫించ్‌ ఫామ్‌లోకి రాగా, వేడ్‌ తన జోరును కొనసాగిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన మ్యాక్స్‌వెల్‌ గాడిలో పడాలి. టిమ్‌ డేవిడ్‌ కూడా ధాటిగా ఆడితే ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. రెండో టి20లో ఒక అదనపు బౌలర్‌ కోసం బ్యాటర్‌ను తగ్గించిన ఆసీస్‌ మళ్లీ బ్యాటర్‌ వైపు మొగ్గు చూపితే ఇన్‌గ్లిస్‌ జట్టులోకి వస్తాడు.

బ్యాటింగ్‌ కంటే కూడా బౌలింగ్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడం కంగారూలకు ఇబ్బందికరంగా మారింది. ఇద్దరు టాప్‌ బౌలర్లలో హాజల్‌వుడ్‌ ఫర్వాలేదనిపించినా, కమిన్స్‌ ఘోరంగా విఫలమవుతున్నాడు. కమి న్స్‌ భారీగా పరుగులిస్తున్నా ఎలిస్, రిచర్డ్సన్‌ గాయపడి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆడించక తప్పడం లేదు. లెగ్‌ స్పిన్నర్‌ జంపా పదునైన బౌలింగ్‌ కంగారూలకు అదనపు బలం. అబాట్, స్యామ్స్‌లలో ఒకరికే చోటు జట్టులో చోటు ఉంటుంది.  

కొన్ని చినుకులు...
వాతావరణ శాఖ అంచనా ప్రకారం హైదరాబాద్‌లో ఆదివారం మ్యాచ్‌కు ఇబ్బంది     లేకుండా సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి. శనివారంలాగే ఆకాశం మేఘావృతమై ఉంటూ అప్పుడప్పుడు స్వల్ప చినుకులు కురిసినా ఆటకు అంతరాయం ఉండకపోవచ్చు.

మరిన్ని వార్తలు