చివరిదైనా గెలిచేనా!

2 Dec, 2020 04:34 IST|Sakshi

నేడు భారత్‌–ఆస్ట్రేలియా మూడో వన్డే

పరువు కాపాడుకునే ప్రయత్నంలో టీమిండియా

ఉదయం గం. 9:10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఐదేళ్ల క్రితం వరుసగా ఐదు వన్డేల్లో ఓడిన తర్వాత భారత్‌ అలాంటి చెత్త ప్రదర్శనను గత మ్యాచ్‌తో పునరావృతం చేసింది. ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ చేతిలో మూడు పరాజయాల తర్వాత తాజాగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడింది. ఇప్పుడు ఆసీస్‌ గడ్డపై పరువు కాపాడుకునేందుకు తమ చివరి మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇక్కడా ఓడితే వరుసగా రెండు సిరీస్‌లు 0–3తో క్లీన్‌ స్వీప్‌ అయినట్లే! సిడ్నీలో రెండుసార్లు భారీ స్కోర్ల పోరాటాల్లో గెలుపు గీత దాటలేకపోయిన టీమిండియా అదృష్టం... వేదిక మారడంతో మారుతుందేమో చూడాలి. మరోవైపు వార్నర్, కమిన్స్‌లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఆ్రస్టేలియా విజయంపై ధీమాగా కనిపిస్తోంది.   

కాన్‌బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో రెండు వరుస పరాజయాలతో దెబ్బ తిన్న భారత జట్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 0–2తో వన్డే సిరీస్‌ కోల్పోయిన అనంతరం నేడు జరిగే చివరి మ్యాచ్‌లో ఆసీస్‌తో పోరుకు సన్నద్ధమైంది. అయితే అన్ని రంగాల్లో అమిత పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్‌ను ఓడించాలంటే కోహ్లి సేన సర్వ శక్తులూ ఒడ్డాల్సిందే.  

చహల్‌ స్థానంలో కుల్దీప్‌! 
సిరీస్‌ కోల్పోయినా... భారత తుది జట్టులో ఎక్కువ మార్పులకు అవకాశం కనిపించడం లేదు. తొలి రెండు మ్యాచ్‌ల ప్రదర్శన చూస్తే జట్టు బ్యాటింగ్‌ మరీ పేలవంగా ఏమీ లేదు. ధావన్, మయాంక్‌ మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. రెండో వన్డేలో కోహ్లి తనదైన శైలిలో చెలరేగడం ఊరట. నాలుగో స్థానంలో తన చోటును ఖాయం చేసుకునేందుకు శ్రమిస్తున్న అయ్యర్‌ నుంచి ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ రావాల్సి ఉండగా... రాహుల్‌ కూడా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్, జడేజా చివర్లో చెలరేగితే భారత్‌ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. పాండ్యా మళ్లీ బౌలింగ్‌ చేస్తుండటం జట్టుకు మేలు చేస్తుంది. ముందుగా షమీ, బుమ్రాలకు చివరి వన్డే నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం కనిపించింది కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండకపోవచ్చు. బుమ్రా రెండుసార్లు భారీగా పరుగులిచ్చుకోవడం టీమిండియాలో ఆందోళన పెంచే అంశం. ఇదే తరహాలో ధారాళంగా పరుగులిచ్చిన చహల్‌ స్థానంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆడటం దాదాపు ఖాయమైంది. మూడో పేసర్‌గా సైనీ ప్రభావం చూపించకపోవడంతో అతని స్థానాన్ని శార్దూల్‌ ఠాకూర్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది.   

సీన్‌ అబాట్‌కు చాన్స్‌!  
ఆ్రస్టేలియా కోణంలో ఈ మ్యాచ్‌కు ప్రాధా న్యత లేదు. అయితే తప్పనిసరి పరిస్థితు ల్లోనే ఆ జట్టు రెండు మార్పులకు సిద్ధమవుతోంది. గాయపడిన వార్నర్, విశ్రాంతినిచ్చిన కమిన్స్‌ స్థానాల్లో ఇద్దరు ఆటగాళ్లు రానున్నారు. వార్నర్‌కు బదులుగా డార్సీ షార్ట్, మాథ్యూ వేడ్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుంది. వికెట్‌ కీపరే అయినా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఇటీవల వేడ్‌ దేశవాళీలో ఓపెనర్‌ పాత్రలో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పేసర్‌ సీన్‌ అబాట్‌కు కమిన్స్‌ స్థానంలో చోటు ఖాయమైంది. మెరుపు బ్యాటింగ్‌ చేయగలగడం కూడా అబాట్‌ అదనపు అర్హత. అతను ఆసీస్‌ తరఫున గతంలో ఒకే ఒక్క వన్డే ఆడాడు. ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌ల భీకర బ్యాటింగ్‌ లైనప్‌తో ఆసీస్‌ మరో విజయంపై గురి పెట్టింది. వీరికి తోడు లబ్‌õÙన్‌ రూపంలో నిలకడైన బ్యాట్స్‌మన్‌ కూడా జట్టులో ఉన్నాడు. ప్రధాన పేసర్‌ స్టార్క్‌ విఫలమవుతున్నా... మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్‌ ఆ లోటు కనిపించకుండా చూస్తున్నారు.   

తుది జట్లు (అంచనా): భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, మయాంక్, అయ్యర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, శార్దూల్, కుల్దీప్‌.
ఆ్రస్టేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వేడ్, స్మిత్, లబ్‌షేన్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ, సీన్‌ అబాట్, స్టార్క్, జంపా, హాజల్‌వుడ్‌.

పిచ్, వాతావరణం
పరుగుల వరద తప్పకపోవచ్చు. మనుకా ఓవల్‌ మైదానం మొదటి నుంచీ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు ఖాయం. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. ముఖ్యంగా గత నాలుగు వన్డేల్లో అత్యల్ప స్కోరు 348 పరుగులు కావడం పరిస్థితిని చూపిస్తోంది. వాతావరణం బాగుంది. వర్ష సూచన లేదు. 

కోహ్లి మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. సచిన్‌ 300 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని దాటగా... కోహ్లి తన 242వ ఇన్నింగ్స్‌లోనే దీనిని అందుకునే అవకాశం ఉంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా