లక్కీ చాన్స్‌ కొట్టేసిన నటరాజన్‌

2 Jan, 2021 10:38 IST|Sakshi

మెల్‌బోర్న్‌: టీమిండియా ప్రదాన బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గాయం కారణంగా ఆసీస్‌ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన ‘యార్కర్‌’ సంచలనం నటరాజన్‌ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో మిగిలున్న రెండు టెస్టుల్లో ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ‘సీనియర్‌ సీమర్‌ ఉమేశ్‌ తీవ్రమైన ఎడమకాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. మూడో టెస్టుకల్లా పూర్తిగా కోలుకునే అవకాశం లేదు. దీంతో మూడు, నాలుగు టెస్టుల కోసం అతని స్థానంలో నటరాజన్‌ ఆడతాడు’ అని షా వెల్లడించారు. నెట్‌ బౌలర్‌గా ఉన్న నటరాజన్‌ తొలుత ఐపీఎల్‌లోనూ ఆపై టీమిండియాలో చోటు సంపాదించి నిరూపించుకున్నాడు. కరోనా కాలంలోనూ లక్కీ చాన్స్‌ కొట్టేసి టెస్టుల్లోనూ అరంగేట్రం చేయనున్నాడు.
(చదవండి: రోహిత్ శర్మకు ప్రమోషన్‌)

ఇదిలాఉండగా.. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో నటరాజన్‌ అరంగేట్రం చేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా టీ20 సిరీస్‌లో మొత్తంగా ఆరు వికెట్లు (3,2,1) తీసి అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. మరోవైపు తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలై సిరీస్‌ కోల్పోయిన టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించి పరువు నిలుపుకుంది. రెండు టీ20 మ్యాచ్‌లలో వరుసగా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. మూడో టీ20లో ఆసీస్‌ గెలుపొందింది. ఇక ప్రతిష్టాత్మక నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు సిడ్నీ వేదికగా ఈ నెల 7 నుంచి మొదలు కానుంది.
(చదవండి: నెట్‌ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్‌)

మరిన్ని వార్తలు