-

India vs Bangladesh 2nd Test Day 3: కొడతారా...పడతారా..!

25 Dec, 2022 06:35 IST|Sakshi
పుజారా స్టంపౌట్‌ (ఇన్‌సెట్‌లో బౌలర్‌ మెహదీ హసన్‌)

భారత్‌ విజయలక్ష్యం 145 

ప్రస్తుతం 45/4

చేతిలో 6 వికెట్లు, మరో 100 పరుగులు

పంత్, శ్రేయస్‌లపై భారం  

పిచ్‌ ఎంత స్పిన్‌కు అనుకూలిస్తున్నా సరే మన మేటి బ్యాటింగ్‌ ఆర్డర్‌ ముందు 145 పరుగుల విజయలక్ష్యం ఒక లెక్కా అనిపించింది... కానీ మైదానంలోకి దిగాక అసలు ఆట మొదలైంది...గింగిరాలు తిరుగుతూ, అనూహ్యంగా వస్తున్న బంతులను ఆడలేక మన బ్యాటర్లు తడబడుతుంటే భారత గడ్డపై విదేశీ బ్యాటర్ల పరిస్థితి గుర్తుకొచ్చింది... రాహుల్, గిల్, పుజారా, కోహ్లి... ఇలా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ వెనుదిరుగుతుంటే 23 ఓవర్లలో ఒక్కో బంతి గండంలా గడిచింది... ఇక మిగిలింది మరో 100 పరుగులు... ఆదివారం డిఫెన్స్‌కు ప్రయత్నించకుండా ఎదురుదాడికి దిగి పంత్, శ్రేయస్‌ జట్టును గెలిపిస్తారా... లేక అంతా స్పిన్‌ మాయలో పడి మ్యాచ్‌ను అప్పగిస్తారా చూడాలి... అంతకు ముందు రెండో ఇన్నింగ్స్‌లో ఒక దశలో 113/6తో ఉన్న బంగ్లా జట్టు చివరి నాలుగు వికెట్లకు మరో 118 పరుగులు చేసే అవకాశం ఇచ్చిన భారత్‌ అనూహ్య సవాల్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితికి మ్యాచ్‌ను చేర్చింది.
 
మిర్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌కు ఓటమి ప్రమాదం పొంచి ఉంది! చేయాల్సిన పరుగులపరంగా చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా శనివారం బంతి స్పిన్‌ అయిన తీరు చూస్తే ఒక్కో పరుగు సాధించడం కూడా కష్టంగా మారవచ్చు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 45 పరుగులు చేసింది.

రాహుల్‌ (2), గిల్‌ (7), పుజారా (6), కోహ్లి (1) ఇప్పటికే పెవిలియన్‌ చేరగా... బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన అక్షర్‌ పటేల్‌ (54 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు ) కాస్త పట్టుదల ప్రదర్శించి నిలబడగా, జైదేవ్‌ ఉనాద్కట్‌ (3 నాటౌట్‌) అతనికి తోడుగా క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 7/0తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (98 బంతుల్లో 73; 7 ఫోర్లు), జాకీర్‌ హసన్‌ (135 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు.

కీలక భాగస్వామ్యాలు...
మూడో రోజు ఆటలో రెండో ఓవర్లో నజ్ముల్‌ (5)ను అశ్విన్‌ అవుట్‌ చేయడంతో బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. మోమినుల్‌ (5)ను సిరాజ్‌ వెనక్కి పంపగా, ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సీనియర్‌ బ్యాటర్లు షకీబ్‌ (13), ముష్ఫికర్‌ (9) వెనుదిరిగారు. అప్పటికి బంగ్లా భారత్‌కంటే ఇంకా 17 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో జాకీర్, దాస్‌ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 129 బంతుల్లో జాకీర్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ఆ వెంటనే జాకీర్‌తో పాటు మెహదీ హసన్‌ (0)నూ పెవిలియన్‌ పంపించి టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో భారత్‌ ఆధిక్యాన్ని తీసేస్తే ఆ స్థితిలో బంగ్లా స్కోరు 26/6గా చెప్పవచ్చు! అయితే తర్వాతి రెండు భాగస్వామ్యాలు ఆ జట్టు పరిస్థితిని మెరుగ్గా మార్చాయి.

అవీ వేగంగా రావడంతో ఆట స్వరూపం మారింది. లిటన్‌ దాస్‌... నూరుల్‌ హసన్‌ (29 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగులు, తస్కీన్‌ అహ్మద్‌ (46 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు)తో ఎనిమిదో వికెట్‌కు 60 పరుగులు జత చేశాడు. ఎట్టకేలకు దాస్‌ను చక్కటి బంతితో బౌల్డ్‌ చేసి సిరాజ్‌ ఊరట అందించగా...చివరి 2 వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్‌ తొలి బంతినుంచే భారత్‌ను కట్టి పడేసింది. దాంతో వికెట్‌ కాపాడుకోవడానికే పరిమితమైన బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాహుల్‌ (2) మళ్లీ విఫలం కాగా, పుజారా (6) అనూహ్యంగా స్టంపౌట్‌ అయ్యాడు. 35 బంతులు ఆడినా గిల్‌ (7) ప్రభావం చూపలేకపోగా, ఆదుకుంటాడనుకున్న కోహ్లి (22 బంతుల్లో 1) కూడా అతి జాగ్రత్తకు అవుటయ్యాడు. మరో ఎండ్‌లో అక్షర్‌ మాత్రమే కొంత ప్రతిఘటించగలిగాడు.  

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 227; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 314;
బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: నజ్ముల్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 5; జాకీర్‌ (సి) సిరాజ్‌ (బి) ఉమేశ్‌ 51; మోమినుల్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 5; షకీబ్‌ (సి) గిల్‌ (బి) ఉనాద్కట్‌ 13; ముష్ఫికర్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 9; లిటన్‌ దాస్‌ (బి) సిరాజ్‌ 73; మెహదీ హసన్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 0; నూరుల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 31; తస్కీన్‌ (నాటౌట్‌) 31; తైజుల్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 1; ఖాలెద్‌ (రనౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (70.2 ఓవర్లలో ఆలౌట్‌) 231. 
వికెట్ల పతనం: 1–13, 2–26, 3–51, 4–70, 5–102, 6–113, 7–159, 8–219, 9–220, 10–231.
బౌలింగ్‌: ఉమేశ్‌ 9–1–32–1, అశ్విన్‌ 22–2–66–2, ఉనాద్కట్‌ 9–3–17–1, సిరాజ్‌ 11–0–41–2, అక్షర్‌ 19.2–1–68–3.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: గిల్‌ (స్టంప్డ్‌) నూరుల్‌ (బి) మెహదీ 7; రాహుల్‌ (సి) నూరుల్‌ (బి) షకీబ్‌ 2; పుజారా (స్టంప్డ్‌) నూరుల్‌ (బి) మెహదీ 6; అక్షర్‌ (నాటౌట్‌) 26; కోహ్లి (సి) మోమినుల్‌ (బి) మెహదీ 1; ఉనాద్కట్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (23 ఓవర్లలో 4 వికెట్లకు) 45.
వికెట్ల పతనం: 1–3, 2–12, 3–29, 4–37.
బౌలింగ్‌: షకీబ్‌ 6–0–21–1, తైజుల్‌ 8–4–8–0, మెహదీ హసన్‌ 8–3–12–3, తస్కీన్‌ 1–0–4–0.  

మూడు క్యాచ్‌లు వదిలేసిన కోహ్లి
భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన విరాట్‌ కోహ్లి శనివారం స్లిప్‌లో పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఏకంగా మూడు క్యాచ్‌లు వదిలేయడంతో బంగ్లాదేశ్‌కు కోలుకునే అవకాశం దక్కింది. వాటిని అందుకొని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. రెండు సార్లు బంతి గమనాన్ని అంచనా వేయడంలో కోహ్లి పొరబడ్డాడు. ఒక వైపు అతను క్యాచ్‌ అందుకునేందుకు సిద్ధం కాగా, బంతి మరో వైపు వెళ్లింది. ఇందులో ఒక సారి పంత్‌ గ్లవ్‌ను తాకుతూ బంతి స్లిప్‌ వైపు వచ్చింది. మరో సారి మాత్రం నేరుగా చేతుల్లోకి వచ్చి కింద పడింది. కోహ్లి క్యాచ్‌ వదిలేసిన సమయాల్లో లిటన్‌ దాస్‌ స్కోరు 20, 49 కాగా...నూరుల్‌ 21 పరుగుల వద్ద ఉన్నాడు. 

మరిన్ని వార్తలు