ఇప్పుడేమంటారు: అశ్విన్‌ భార్య

15 Feb, 2021 14:43 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే టీమిండియా బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు‌ వరుస కట్టారు. 55 పరుగుల వద్ద పుజారా (7) రనౌట్ కాగా, అదే పరుగుల వద్దే రోహిత్ శర్మ‌ (26) కూడా ఔట్‌ అయ్యాడు. 65 పరుగుల వద్ద రిషభ్‌ పంత్‌ (8) వెనుదిరిగాడు. 86 పరుగుల వద్ద రహానే‌ (10) పెవిలియన్‌ చేరాడు. ఈక్రమంలో క్రీజులోకొచ్చిన కెప్టెన్‌ కోహ్లి (62) ఆచితూచి ఆడాడు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక అక్సర్‌ (7) ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ కోహ్లితో కలిసి ఏడో వికెట్‌కు కీలకమైన 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ షో
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన రవిచంద్రన్‌ అశ్విన్ బ్యాటింగ్‌లోనూ రాణించాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు స్కోరు గాడిలో పడటంలో సహకరించాడు. కోహ్లితో కలిసి 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈక్రమంలో అశ్విన్‌ భార్య ప్రీతి స్పందించారు. ‘అశ్విన్‌ ఇప్పుడందర్నీ ట్రోల్‌ చేస్తున్నాడు’ అంటూ లాఫింగ్‌ ఎమోజీతో ట్వీట్‌ చేశారు. అశ్విన్‌ ప్రదర్శనపై విమర్శలు గుప్పించేవారికి పరోక్షంగా చురకలు అంటించారు. ఇదిలా ఉంచితే ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ సెంచరీ సాధించాడు. 148 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులు సాధించి చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

ఇక ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓటమితో నాలుగు టెస్టులో సిరీస్‌లో 0-1 తో టీమిండియా వెనుకబడిన సంగతి తెలిసిందే. అయితే, చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న తాజా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ (161)‌, రహానే (67), పంత్ (58)‌ చలవతో 329 పరుగులు చేసింది. దాంతోపాటు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌కు తోడు ఇషాంత్‌ మెరుగైన బౌలింగ్‌తో ఇంగ్లిష్‌ జట్టును 134 పరుగులకే కట్టడి చేసింది. 

చదవండి: 
200 మంది లెఫ్ట్‌ హ్యాండర్స్‌.. తొలి బౌలర్‌గా రికార్డు

మరిన్ని వార్తలు