ఈ క్యాచ్‌ చూశాక మాట్లాడండి బాస్‌!

14 Feb, 2021 14:50 IST|Sakshi

బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకున్నా రిషభ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. కనీసం కీపర్‌గా కూడా అతను ప్రతిభ చూపడం లేదు. పంత్‌ను కొనసాగించడం అవసరమా? మెరుగ్గా కీపింగ్‌ చేసే వృద్ధిమాన్‌ సాహాను ఎందుకు దూరం పెడుతున్నారు? ఇవి సగటు భారత క్రికెట్‌ అభిమానుల నుంచి వచ్చిన సందేహాలు, ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు.

అయితే, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ పంత్‌ ఫామ్‌లోకొచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో (97),  బ్రిస్బేన్‌ టెస్టులో (89 నాటౌట్) పరుగులు చేసి అందరి నోళ్లు మూయించాడు. ఈ క్రమంలోనే మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. పంత్‌ను ఇక కీపర్‌గా కాకుండా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా పరిగణించాలనేది మేటర్‌. ఎందుకంటే బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ కీపింగ్‌ విషయంలో అతను కొన్ని పొరపాట్లు చేయడమే దీనికి కారణం.

తాజాగా కీపింగ్‌ విమర్శలకూ పంత్‌ సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను ఓ అద్భుతమైన క్యాచ్‌ పట్టి కీపింగ్‌లోనూ సత్తా చాటుతానని నిరూపించాడు. దాంతోపాటు సొంతగడ్డపై తొలి టెస్టు ఆడుతున్న సిరాజ్‌కు.. తొలి బంతికే వికెట్‌ దక్కేలా చేశాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్సింగ్స్‌ 39 ఓవర్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. సిరాజ్‌ వేసిన బంతిని ఓలీ పోప్‌ (57 బంతుల్లో 22; 1 ఫోర్‌) బౌండరీ తరలిద్దామనుకున్నాడు. ఓలీ గౌవ్స్‌ను తాకి వికెట్ల వెనకాల నుంచి పరుగులు పెడుతోంది. 

మెరుపువేగంతో అద్భుతంగా డైవ్‌ చేసిన పంత్‌ ఒంటి చేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. కాగా, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ను ఓపెనర్‌ రోహిత్‌ (161) వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడు రహానే (67), పంత్‌ (58 నాటౌట్‌) రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగలిగింది. ఇక రెండో  రోజు ఆటలో భారత బౌలర్లు ఆధిపత్యం కనబర్చడంతో టీ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.    

పంత్‌ పట్టిన మరో క్యాచ్‌

చదవండి:
ఆ అవార్డు రిషభ్‌ పంత్‌దే..
పంత్‌,ఇంగ్లండ్‌ కీపర్‌ గొడవ.. మధ్యలో స్టోక్స్‌

మరిన్ని వార్తలు