సిరీస్‌ ఎవరిదో?

20 Mar, 2021 05:43 IST|Sakshi

నేడు భారత్, ఇంగ్లండ్‌ చివరి టి20

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

అహ్మదాబాద్‌: హోరాహోరీగా సాగిన భారత్, ఇంగ్లండ్‌ టి20 సిరీస్‌ చివరి ఘట్టానికి చేరింది. ఐదు మ్యాచ్‌ల ఈ పోరులో ఇరు జట్లు 2–2తో సమంగా ఉండగా... నేడు జరిగే ఐదో మ్యాచ్‌లో సిరీస్‌ విజేత ఎవరో తేలనుంది. మొదటి, మూడో మ్యాచ్‌లలో మోర్గాన్‌ బృందం విజయం సాధించగా... రెండో, నాలుగో మ్యాచ్‌లలో గెలుపు కోహ్లి సేన సొంతమైంది. తొలి మూడు మ్యాచ్‌లకు భిన్నంగా గత పోరులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. దాంతో టాస్‌ ఫలితం ఎలా ఉన్నా భారీ స్కోరు సాధిస్తే గెలిచే అవకాశం ఉంటుందని ఇరు జట్లకు అర్థమైంది.

భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఓడినా దాదాపు గెలుపునకు చేరువగా వచ్చింది. స్టోక్స్‌ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌ను మరింత పటిష్టంగా మార్చింది. బౌలింగ్‌లో మరోసారి వుడ్, ఆర్చర్‌ల పేస్‌పై ఇంగ్లండ్‌ జట్టు ఆశలు పెట్టుకుంది. చివరి వరకు బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లు ఉండటం ఇంగ్లండ్‌కు మరో బలం. నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత పిచ్‌లపై ఇరు జట్లకు అవగాహన వచ్చేసింది కాబట్టి పిచ్‌ ఏ రకంగా ఉంటుందనే విషయానికి ప్రాధాన్యత ఉండకపోవచ్చు. దాదాపు సమానంగా కనిపిస్తున్న ఐసీసీ టాప్‌–2 జట్ల మధ్య పోరులో చివరకు ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరం.  

మరిన్ని వార్తలు