టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు; అశ్విన్‌ సీరియస్‌ ట్వీట్‌!

26 Feb, 2021 17:20 IST|Sakshi

అహ్మదాబాద్‌: ‘‘తమ వద్ద ఉన్న ఉత్పత్తులను అమ్ముకునేందుకు చాలా మంది వివిధ రకాల మార్కెట్‌ వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన, ఆమోదయోగ్యమైన విధానమే! అయితే ఇప్పుడు మనం ఎలాంటి యుగంలో నివసిస్తున్నాం అంటే...  ఇక్కడ మనకు ఐడియాలు కూడా అమ్ముతారు. ఔట్‌బౌండ్‌ మార్కెటింగ్‌కు ఇదొక క్లాసిక్‌ ఎగ్జాంపుల్‌.  ఇవి ఎలాంటివి అంటే.. ‘‘మీరు మీ సొంతంగా ఆలోచించకూడదు’’ అని చెబుతున్నట్లుగా ఉంటాయి. అంతేకాదు, మీరు ఎలా ఆలోచించాలో, అది కూడా మేం ఏం కోరుకుంటామో, అదే తరహాలో ఆలోచించాలని బోధిస్తాయి. ఒక మంచి గేమ్‌ ఆడిన తర్వాత.. నాకేం అనిపించిందంటే.. ఇలాంటి ఐడియాలు మనం కొంటూ ఉన్నంత వరకు అవి మన గొంతునొక్కేస్తూనే ఉంటాయి. 

గళమెత్తకుండా చేస్తాయి. చివరగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే... మన అభిప్రాయాలకు మనం కట్టుబడి ఉండాలి. మెజారిటీ ప్రజలు దానిని వ్యతిరేకించినా సరే మన ఆలోచనకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే.. అది మనకు ఎవరో అమ్మిన ఐడియా కాదు కదా! ఏదేమైనా చాయిస్‌ మన చేతుల్లోనే ఉంటుంది’’ అంటూ టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిమానులను సందేహంలో పడేశాడు. మార్కెటింగ్‌ టెక్నిక్‌ల గురించి చెబుతున్నట్లుగా ఉన్న ఈ ట్వీట్‌తో విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో అశ్విన్‌ ఏడు వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను అవుట్‌ చేయడం ద్వారా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 

భారత్‌ తరఫున టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతేగాక టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీమిండియా బౌలర్లలో అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌ దేవ్‌(434), హర్భజన్‌ సింగ్‌(417) మాత్రమే 400 వికెట్ల క్లబ్‌లో ఉన్నారు.  ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో మొతేరా పిచ్‌ను రూపొందించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పేసర్లకు అనుకూలం అనుకున్న ఈ పిచ్‌పై ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగిపోవడంతో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. 

ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌...  ‘‘రెండు రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడం టెస్టు క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఒకవేళ అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ ఈ పిచ్‌పై బౌలింగ్‌ చేస్తే వెయ్యి లేదా 800 వికెట్ల మైలురాయి వద్ద కూర్చునేవారేమో? ఏదైతేనేమి టీమిండియాకు శుభాకాంక్షలు. అక్షర్‌ పటేల్‌ స్పెల్‌ అద్భుతం! అశ్విన్‌కు కంగ్రాట్స్‌. వందో టెస్టు ఆడిన ఇషాంత్‌ శర్మకు కూడా’’అంటూ పిచ్‌పై వ్యంగ్య రీతిలో ట్వీట్‌ చేశాడు. ఇందుకు బదులుగానే అశ్విన్‌ పైవిధంగా స్పందించి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిచ్‌ను సాకుగా చూపి, 72 టెస్టుల్లోనే 400 వికెట్లు తీసిన అశ్విన్‌ ప్రతిభను తక్కువ చేసి చూపడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే ఆ ట్వీట్ల వెనుక ఆంతర్యం ఏమిటో అశ్విన్‌కు మాత్రమే తెలియాలి!

చదవండి: అద్భుత విజయం.. అగ్రస్థానంలో టీమిండియా

 ఆర్చర్‌ ఔట్‌, రికార్డు సృష్టించిన అశ్విన్‌

మరిన్ని వార్తలు