కోహ్లితో మాటల యుద్ధంలో స్టోక్స్‌ గెలిచాడు.!

5 Mar, 2021 13:21 IST|Sakshi

నిన్నటి మాటల యుద్ధంలో స్టోక్స్‌ విజేతగా నిలిచాడు: గ్రేమ్‌ స్వాన్‌

అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై పైచేయి సాధించాడని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అన్నాడు. తద్వారా మొదటి రోజు జరిగిన వాగ్యుద్ధంలో అతడే విజేతగా నిలిచాడని పేర్కొన్నాడు. కాగా నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో 26వ ఓవర్‌ నాలుగో బంతిని కోహ్లి ఫ్లిక్‌ చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడింది. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. దీంతో 41 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 

ఈ నేపథ్యంలో గ్రేమ్‌ స్వాన్‌ శుక్రవారం మాట్లాడుతూ...‘‘కోహ్లి వరల్డ్‌ క్లాస్‌ ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, మొటేరా పిచ్‌ ఈరోజు బ్యాట్స్‌మెన్‌కు అంతగా అనుకూలించకపోవచ్చని నేను ముందే చెప్పాను. నిజానికి క్రీజులోకి వచ్చిన వెంటనే కోహ్లి పరుగులు పిండుకోవాలని భావిస్తాడు. బంతిని చీల్చి చెండాటం అతడికి ఇష్టం. ఇక్కడ కూడా అదే చేయాలనుకున్నాడు. కానీ, స్టోక్స్‌ చక్కని బంతితో అతడిని అవుట్‌ చేశాడు. నిన్నటి మాటల యుద్ధాన్ని గనుక ఒకసారి గుర్తుచేసుకుంటే, ఈరోజు కోహ్లి వికెట్‌ తీసి స్టోక్స్‌ విన్నర్‌గా నిలిచాడని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు.

కాగా గురువారం నాటి ఆటలో భాగంగా టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిరాజ్‌కు మద్దతుగా నిలిచిన, కోహ్లి స్టోక్స్‌ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరగగా, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఇంగ్లండ్‌ 75.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. స్టోక్స్‌ అర్ధ సెంచరీతో మెరిశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 24 పరుగులు చేసి ఒక వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రెండో రోజు ఆటను కొనసాగిస్తోంది.

చదవండి: అసలు ఏం చెప్తున్నావు కోహ్లి.. నీకు అర్థం కాదులే!

మరిన్ని వార్తలు