కీలకమైన నాల్గో టెస్టు నుంచి వైదొలిగిన బుమ్రా

27 Feb, 2021 13:52 IST|Sakshi
టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(ఫొటో కర్టసీ: బీసీసీఐ)

ముంబై: ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్‌ అహ్మదాబాద్‌ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత క్రికెట్‌ నియంత్రణ మండలిని కోరడంతో బోర్టు ఇందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో అతడు చివరి టెస్టుకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా బుమ్రా స్థానంలో జట్టులోకి మరే ఇతర ఆటగాడిని తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. కాగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.

అదే విధంగా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన మూడో టెస్టు విజయంతో ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆఖరి టెస్టులో విజయం సాధించినా లేదంటే డ్రా చేసుకున్నా భారత్‌ ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో బుమ్రా జట్టుకు దూరం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశం. అయితే, మొతేరా పిచ్‌పై జరిగిన గత మ్యాచ్‌లో స్పిన్నర్ల హవా కొనసాగడం.. తదుపరి మ్యాచ్‌ కూడా అక్కడే జరగనుండటంతో బుమ్రా లేని లోటు పెద్దగా కనిపించకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే ఆటగాళ్లు:
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌.

చదవండిఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదు: మాజీ క్రికెటర్‌

'కోహ్లి మాటలు నాకు కోపం తెప్పించాయి'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు