అందుకే సెలవు తీసుకున్న బుమ్రా!

3 Mar, 2021 12:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరుగనున్న నాలుగో టెస్టు నుంచి టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైదొలిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో బుమ్రాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ యువ బౌలర్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. ఈ కారణంగానే అతడు ఆటకు విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ... ‘‘త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు అతడు బోర్డుకు తెలిపాడు. వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడు’’ అని పేర్కొన్నాయి. 

కాగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు లేదన్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన బుమ్రా.. మార్చి 23 నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరుగనున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టు మార్చి 4 నుంచి మొదలుకానుంది. ఇక టెస్టు సిరీస్‌లో కోహ్లి సేన ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం విదితమే.

చదవండి: ఈ పిచ్‌లోనూ అంతే.. టెస్ట్‌ మ్యాచ్‌ ఇక..

ఇంగ్లండ్‌తో టి20లకు భారత జట్టు ప్రకటన

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు