ఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదు: మాజీ క్రికెటర్‌

25 Feb, 2021 17:25 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. తద్వారా పర్యాటక జట్టు కంటే 33 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 99/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజును ఆటను ఆరంభించిన కోహ్లి సేన.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ దెబ్బకు విలవిల్లాడింది. పార్ట్‌ టైం ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన రూట్‌, తమ జట్టు ప్రధాన స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌తో సమానంగా ఐదు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. పేసర్లకు అనుకూలం అనుకున్న పింక్‌ బాల్‌ టెస్టు పిచ్‌పై తొలి రోజు టీమిండియా స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ సత్తా చాటగా, రెండో రోజు రూట్‌ స్పిన్‌ మాయాజాలంతో భారత్‌ను దెబ్బకొట్టాడు. 

ఇదిలా ఉంటే.. తొలుత 112 పరుగులకు ఆలౌట్‌ అయిన ఇంగ్లండ్‌, గురువారం నాటి రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే, బెయిర్‌స్టోను అక్షర్‌ పటేల్‌ పెవలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మరో ఓపెపర్‌ సిబ్లీ కూడా అక్షర్‌కే వికెట్‌ సమర్పించుకుని వెనుదిరిగాడు దీంతో మరోసారి స్పిన్నర్లు మ్యాజిక్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ పిచ్‌పై ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడ్డాయి. వీటిలో రెండు మినహా(ఇషాంత్‌ శర్మ,  ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ చెరో వికెట్‌) మిగతావన్నీ స్పిన్నర్లు తీసినవే.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ మొతేరా పిచ్‌ గురించి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదు’’ అంటూ సెటైర్లు వేశాడు. కాగా చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కూడా మైకేల్‌ వాన్‌, చెపాక్‌ పిచ్‌పై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిచ్‌ షాక్‌కు గురిచేసింది. టీమిండియా చాలా మెరుగ్గా ఆడింది. కానీ ఇది 5 రోజుల టెస్టు మ్యాచ్‌ కోసం తయారుచేసిన పిచ్‌ మాత్రం కాదు’’ అని కామెంట్‌ చేసి విమర్శల పాలయ్యాడు. కాగా రెండో టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌పై 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

చదవండిఅమ్మో రూట్‌.. ప్రధాన స్పిన్నర్‌ను మించిపోయాడు

 డబుల్‌ సెంచరీ... పృథ్వీ షా సరికొత్త రికార్డు

మరిన్ని వార్తలు