మనోళ్లు మైదానంలోకి...

2 Feb, 2021 01:15 IST|Sakshi

కరోనా పరీక్షలో నెగ్గిన భారత్, ఇంగ్లండ్‌ క్రికెటర్లు

రేపటి నుంచి నెట్‌ ప్రాక్టీస్‌

చెన్నై: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఆరంభ విఘ్నాన్ని అధిగమించారు. నిబంధనల ప్రకారం నిర్వహించిన కోవిడ్‌–19 పరీక్షల్లో క్రికెటర్లంతా నెగెటివ్‌గా తేలారు. ఆరు రోజులుగా ఆటగాళ్లంతా క్వారంటైన్‌లో ఉన్నారు. సోమవారంతో ఇది ముగిసింది. ఈ ఆరు రోజుల కాలంలో ఒక్కో ఆటగాడికి మూడుసార్లు చొప్పున కరోనా టెస్టులు జరిపారు. అన్నింటిలోనూ నెగెటివ్‌ ఫలితం రావడంతో ఎలాంటి సమస్య లేకుండా టెస్టు సిరీస్‌ ఆరంభానికి రంగం సిద్ధమైంది.  

తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు మూడు రోజుల పూర్తి స్థాయి నెట్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు సాధన చేసేందుకు తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రమే కొందరు భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగి అవుట్‌డోర్‌ సాధనకు ఉపక్రమించారని బీసీసీఐ వెల్లడించగా... నేడు ఆటగాళ్లంతా నెట్స్‌లోకి వస్తారని ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది.

శ్రీలంక పర్యటనకు వెళ్లకుండా నేరుగా ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన బెన్‌ స్టోక్స్, ఆర్చర్, బర్న్స్‌ క్వారంటైన్‌ పూర్తి చేసుకొని గత రెండు రోజులుగా సాధన చేస్తూనే ఉన్నారు. ఈ నెల 5 నుంచి తొలి టెస్టు, 13 నుంచి రెండో టెస్టు చెన్నైలో జరగనుండగా... తర్వాతి రెండు టెస్టులకు అహ్మదాబాద్‌ ఆతిథ్యమిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన అద్భుత విజయంతో టీమిండియా అమితోత్సాహంతో బరిలోకి దిగుతుండగా... శ్రీలంకపై 2–0తో గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు