పిచ్‌ ఎలా ఉంటదో: టెన్షన్‌ అవసరం లేదు రోహిత్‌!

1 Mar, 2021 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో నిర్ణయాత్మక నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొటేరా పిచ్‌పై క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. పిచ్‌ ఎలా ఉండబోతుందోనన్న అంశం గురించి చర్చ జరుగుతోంది.  కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లకు స్వర్గాధామంలా మారిన ఈ పిచ్‌పై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు సహా ఇంగ్లీష్‌ మీడియా విమర్శలు కురిపిస్తోంది. అయితే వెస్టిండీస్‌ క్రికెట్‌ లెజెండ్‌ వివియన్‌ రిచర్డ్స్‌ వంటి దిగ్గజాలు మాత్రం ఆటపై దృష్టి సారించాలని, సవాళ్లను అధిగమించాలే తప్ప పిచ్‌ను నిందించడం సరికాదని పర్యాటక జట్టుకు హితవు పలుకుతున్నారు. అంతేకాదు ఆఖరి టెస్టుకు ఇదే తరహా పిచ్‌ రూపొందించాలని రిచర్డ్స్‌ కోరడం గమనార్హం.

ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. ‘‘ నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండబోతోందో’’ అంటూ మైదానంలో పడుకుని తీక్షణంగా ఆలోచిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘సిమెంట్‌తో చేసినా ఫరవాలేదు. పెద్దగా టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. నువ్వున్నావుగా రోహిత్‌ భాయ్‌’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక రోహిత్‌ సతీమణి రితికా సజ్దే సైతం.. ఊరికే ఏం చేయకుండా చక్కర్లు కొడుతున్నానని, నన్ను ఆటపట్టిస్తున్నావు కదా అంటూ భర్తను ట్రోల్‌ చేశారు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో ఆఖరి టెస్టు మొదలుకానుంది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: నాల్గో టెస్టుకు సేమ్‌ పిచ్‌ కావాలి: మాజీ క్రికెటర్‌ 

A post shared by Rohit Sharma (@rohitsharma45)

మరిన్ని వార్తలు