దురదృష్టవశాత్తూ రూట్‌ కూడా వికెట్లు తీశాడు: అక్తర్‌

2 Mar, 2021 14:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఎలాంటి పిచ్‌పై ఆడినా సరే గెలిచే సత్తా టీమిండియాకు ఉందని, కాబట్టి నాలుగో టెస్టులో నాణ్యమైన పిచ్‌ రూపొందించాలని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ విజ్ఞప్తి చేశాడు. భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించగలదని, అనవసర భయాలు అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా అహ్మదాబాద్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లి సేన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1తో టెస్టు సిరీస్‌లో ముందంజలో నిలిచింది. అయితే మొతేరా పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా రూపొందించడం వల్లే భారత్‌ విజయం సాధించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సిరీస్‌ విజయంలో నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు కూడా అదే మైదానంలో జరుగనుండటంతో పిచ్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌, పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా తన అనుభవాలు పంచుకున్నాడు. ‘‘అలాంటి వికెట్‌పై ఎవరైనా టెస్టు మ్యాచ్‌లు ఆడతారా? అస్సలు ఆడరు కదా. రెండు రోజుల్లో మ్యాచ్‌ ముగిసిపోవడం టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు. స్వదేశంలో సిరీస్‌ జరుగుతున్నందున పిచ్‌ అడ్వాంటేజ్‌ తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇక్కడ కాస్త అది శ్రుతి మించింది. ఒకవేళ ఇండియా 400 పరుగులు చేసి, ఇంగ్లండ్‌ 200 రన్స్‌కే ఆలౌట్‌ అయితే, పర్యాటక జట్టు బాగా ఆడలేకపోయిందని చెప్పవచ్చు. కానీ భారత్‌ కూడా 145 పరుగులకే కుప్పకూలింది కదా. 

టీమిండియా పెద్ద జట్టు. ఇలా ఆడకూడదు. నాణ్యమైన పిచ్‌లపై కూడా ఇంగ్లండ్‌ వంటి జట్లను మట్టికరిపించగల సత్తా వారికి ఉంది. అనవసర భయాలతో ఇలాంటి పిచ్‌ తయారు చేయడం సరికాదు. అడిలైడ్‌లో ఇండియాకు అనుకూలమైన పిచ్‌ రూపొందించారా? మెల్‌బోర్న్‌లో భారత్‌కు లబ్ది చేకూరేలా పిచ్‌ తయారు చేశారా? అయినా కూడా ఇండియా విదేశీ గడ్డపై సిరీస్‌ గెలిచింది కదా? నిజాయితీగా ఆడి గెలిస్తేనే మజా ఉంటుంది. మనం స్వదేశంలో, విదేశాల్లో ఎంతో మెరుగ్గా ఆడగలం. ఈ విషయాలను ఇండియా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి పిచ్‌లపై ఆడటం మీ స్థాయికి తక్కువే. ఎవరేమన్నా ఇది నిజం. ఆట మూడో రోజు లేదంటే నాలుగో రోజు అడ్వాంటేజ్‌ తీసుకున్నారు అంటే ఓకే. 

కానీ.. దురదృష్టవశాత్తూ అక్కడ జో రూట్‌ కూడా వికెట్లు తీశాడు. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాలుగో టెస్టులో మంచిగా ఆడతారు అనుకుంటున్నా. బెస్ట్‌ పిచ్‌ తయారు చేస్తారు అని భావిస్తున్నా. హోం అడ్వాంటేజ్‌ తీసుకోవాల్సిన స్థితిలో టీమిండియా లేదు. సిరీస్‌ గెలిచే సత్తా భారత్‌ సొంతం. ఆస్ట్రేలియా గడ్డపై వాళ్లను ఓడించిన జట్టుకు స్వదేశంలో గెలవడం పెద్ద సమస్యేమీ కాదు. కాబట్టి నాణ్యమైన పిచ్‌ రూపొందించండి’’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఆఖరి టెస్టు ఆరంభం కానుంది. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 145  పరుగులకు ఆలౌట్‌ కాగా, ఇంగ్లండ్‌ 112 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే పర్యాటక జట్టును ఆలౌట్ చేసిన భారత్‌ పది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.‌

చదవండి: పిచ్‌ ఎలా ఉంటదో: టెన్షన్‌ అవసరం లేదు రోహిత్‌!                 

నాల్గో టెస్టుకు సేమ్‌ పిచ్‌ కావాలి: మాజీ క్రికెటర్‌ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు