అద్భుత విజయం.. అగ్రస్థానంలో టీమిండియా

25 Feb, 2021 20:25 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా అపూర్వ విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి గెలుపును తన పేరిట లిఖించుకుంది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్‌ జట్టు పేకమేడలా కుప్పకూలిపోగా.. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కనీసం 200 మార్కు దాటకుండానే పర్యాటక జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ దూకుడు ముందు నిలవలేక చేతులెత్తేసి తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 

ఇక అదే మొతేరా పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ ఓపికగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. తద్వారా గెలుపు టీమిండియా వశమైంది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 2-1 తేడాతో ముందంజలో నిలిచింది. ఇక మూడో టెస్టు విజయంతో కోహ్లి సేన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(2019-21)లో ఫైనల్‌కు చేరువైంది. 490 పాయింట్లతో టేబుల్‌లో అగ్రపథాన నిలిచింది. ఇక అహ్మదాబాద్‌లో జరిగే నాలుగు టెస్టులో విజయం సాధించినా లేదంటే డ్రా చేసుకున్నా ఫైనల్‌లో అడుగుపెట్టడం లాంఛనమే. ఈ నేపథ్యంలో టీమిండియా కచ్చితంగా విజయం సాధించి తీరుతుందంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తాజా పరాజయంతో ఇంగ్లండ్‌ ఏ మార్పు లేకుండా నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక న్యూజిలాండ్‌ 420 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆ దేశ దాయాది జట్టు ఆస్ట్రేలియా 332 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

టీమిండియా
తొలి ఇన్నింగ్స్‌: 145 ఆలౌట్‌: రెండో ఇన్నింగ్స్‌: 49/0

ఇంగ్లండ్‌:
తొలి ఇన్నింగ్స్‌: 112 ఆలౌట్‌: రెండో ఇన్నింగ్స్ 81 ఆలౌట్‌

చదవండి:  ఇది 5 రోజుల టెస్టు పిచ్‌ కాదు: మాజీ క్రికెటర్

>
మరిన్ని వార్తలు