పాత పోరు... కొత్తగా

1 Jul, 2022 02:07 IST|Sakshi

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ ఐదో టెస్టు 

కరోనా కారణంగా గత ఏడాది వాయిదా పడిన చివరి మ్యాచ్‌ 

మ్యాచ్‌కు రోహిత్‌ దూరం, కెప్టెన్‌గా బుమ్రా 

మ.గం.3 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌ 3, 4 లలో ప్రత్యక్ష ప్రసారం 

గత ఏడాది సెప్టెంబర్‌... భారత్, ఇంగ్లండ్‌ మధ్య నాలుగు టెస్టులు జరిగాయి. రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్‌లో చివరి టెస్టు ఆరంభానికి ముందు భారత శిబిరంలో నెలకొన్న కరోనా ఆందోళనతో అనూహ్యంగా ఐదో టెస్టు ఆగిపోయింది.   పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇదే టెస్టును ఆడాలని ఇరు బోర్డులు అంగీకారానికి రావడంతో ఇప్పుడు మళ్లీ టెస్టు పోరు కోసం భారత జట్టు ఇంగ్లండ్‌కు తరలి వెళ్లింది. ఇన్ని రోజుల్లో ఇరు జట్లలో పలు మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రానుందనేది ఆసక్తికరంగా మారింది.  

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ గడ్డపై 2007లో చివరి సారి టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌ ఇప్పుడు మరోసారి అదే ఫలితం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్‌తో నేటినుంచి జరిగే ఐదో టెస్టులో టీమిండియా తలపడనుంది. గత పర్యటనతో పోలిస్తే రెండు జట్లూ కూడా కొత్త కోచ్‌లు, కొత్త కెప్టెన్‌ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి.   

అశ్విన్‌ లేదా శార్దుల్‌ 
గత ఏడాది ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టుతో పోలిస్తే ఈ సారి తుది జట్టులో పలు మార్పులు ఖాయం. రోహిత్, రాహుల్, రహానే జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్, మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి ఆడటం లాంఛనమే. టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా కీలకం కానుండగా...కెప్టెన్సీనుంచి దూరమైన కోహ్లి తన స్థాయి మేరకు సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. ఆరో బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌నుంచి భారత్‌ మెరుగైన ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

బౌలింగ్‌ విభాగంలో ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ సందేహం లేకుండా బరిలోకి దిగుతారు. ప్రధాన స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా స్థానానికి కూడా ఢోకా లేదు. అయితే మిగిలిన మరో స్థానం కోసమే పోటీ నెలకొని ఉంది. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌   అశ్విన్‌ దీని కోసం పోటీ పడుతున్నారు. ఇంగ్లండ్‌లో ఇటీవల పిచ్‌లు బాగా మారిన నేపథ్యంలో నాలుగో పేసర్‌కంటే రెండో స్పిన్నర్‌ ప్రభావం చూపగలడనుకుంటే అశ్విన్‌కు చాన్స్‌ లభిస్తుంది.  

దూకుడే మంత్రం... 
చివరి టెస్టు కోసం ఇంగ్లండ్‌ తమ తుది జట్టును గురువారం ప్రకటించింది. భారత్‌తో జరిగిన నాలుగో టెస్టుతో పోలిస్తే ఇంగ్లండ్‌ టీమ్‌లో ఏకంగా ఏడు మార్పులు జరగడం విశేషం! రూట్, బెయిర్‌స్టో, అండర్సన్, పోప్‌ మాత్రమే తమ స్థానాలు నిలబెట్టుకోగా, గత సిరీస్‌ ఆడని బెన్‌ స్టోక్స్‌ ఈ సారి కెప్టెన్‌గా వచ్చాడు. ఎప్పటిలాగే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు రూట్‌ మూలస్థంభం కాగా, బెయిర్‌స్టో తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా విఫలమవుతున్నా ఓపెనర్‌ క్రాలీపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది. కీపర్‌ బిల్లింగ్స్‌ కూడా సమర్థుడైన బ్యాటర్‌. బౌలింగ్‌లో వెటరన్‌ స్టార్లు అండర్సన్, బ్రాడ్‌ మరోసారి ప్రత్యర్థిపై చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. 

‘36వ కెప్టెన్‌’ 
రోహిత్‌ కోవిడ్‌నుంచి కోలుకోకపోవడంతో ఇంగ్లండ్‌తో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జస్‌ప్రీత్‌ బుమ్రా భారత్‌ 36వ టెస్టు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. కుంబ్లే తర్వాత ఒక బౌలర్‌ భారత్‌కు కెప్టెన్‌ కావడం ఇదే తొలిసారి కాగా, కపిల్‌దేవ్‌ తర్వాత నాయకత్వం వహిస్తున్న మొదటి పేసర్‌. అయితే ఒక స్పెషలిస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్‌ భారత టెస్టు కెప్టెన్‌ కావడం మాత్రం ఇదే మొదటిసారి.    

మరిన్ని వార్తలు