‘నాల్గో టెస్టుకూ అదే తరహా పిచ్‌ రూపొందించండి’

1 Mar, 2021 12:50 IST|Sakshi

న్యూఢిల్లీ: మొటేరా పిచ్‌ నాణ్యతపై చర్చ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ఇప్పటికే.. ‘‘ఇది ఐదు రోజుల టెస్టు పిచ్‌ కాదు’’ అంటూ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించిన నాటి నుంచి ఇంగ్లిష్‌ మీడియా సైతం ఇదే తరహా కామెంట్లు చేస్తోంది. ఈ విషయాల గురించి తాజాగా స్పందించిన వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్.. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడం తనకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు పిచ్‌ గురించి మాట్లాడటం మానేయాలని, స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై పర్యాటక జట్టు దృష్టి సారించాలని హితవు పలికాడు.

‘‘ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో, మూడో టెస్టు గురించి ఈ మధ్య కాలంలో చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాను. పిచ్‌ గురించి ఎవరైతే బాగా బాధపడుతున్నారో వారు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. టెస్టు మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. స్పిన్‌కు మాత్రమే పిచ్‌ అనుకూలిస్తుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. నిజానికి మీరు ఎక్కడ ఆడుతున్నారో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకు వెళ్తున్నారు అంటేనే స్పిన్‌ లాండ్‌కు వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. పిచ్‌ గురించి చింతించడం మానేయాలి’’ అని ఫేస్‌బుక్‌ వీడియోలో రిచర్డ్స్‌ చెప్పుకొచ్చాడు. 

అదే విధంగా నాలుగో టెస్టుకు కూడా సేమ్‌ పిచ్‌ను తయారు చేయాలని ఇండియాకు విజ్ఞప్తి చేశాడు. ‘‘రెండు రోజుల్లోనే మూడో టెస్టు ముగిసింది. కాబట్టి పిచ్‌ను అంచనా వేసేందుకు ఇంగ్లండ్‌కు మంచి అవకాశం దొరికినట్లయింది. నాలుగో టెస్టు ఎలా ఉండబోతోందో అర్థమయింది. నేనైతే ఆఖరి టెస్టు మ్యాచ్‌కు కూడా అదే పిచ్‌ తయారుచేయాలని కోరుకుంటున్నా’’అని రిచర్డ్స్‌' పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పిచ్‌ నాణ్యతపై చర్చ చేయి దాటిపోతోందంటూ విమర్శకులపై మండిపడిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ‘‘పిచ్‌ స్పిన్నింగ్స్‌కు అనుకూలంగా మారినప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరు ఏడుపు మొదలెట్టేశారు’’ అని కౌంటర్‌ ఇచ్చాడు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి'పిచ్‌ను నిందించడం కాదు.. ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టండి'

 మొటేరా పిచ్‌ ఎలా తయారవుతుందో చూడండి!

మరిన్ని వార్తలు