అర్ధ సెంచరీ: ఎనిమిదో భారత ఆటగాడిగా సుందర్!

8 Feb, 2021 12:16 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో, విదేశంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. మాజీ ఆటగాళ్లు రుసీ మోదీ, సురీందర్‌ అమర్‌నాథ్‌, అరుణ్‌లాల్‌, టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్యా,  మయాంక్‌ అగర్వాల్‌ ఇంతకు ముందు ఈ ఘనత సాధించారు. కాగా నాలుగో రోజు ఆటలో భాగంగా వాషింగ్టన్‌ సుందర్‌ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.

138 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో జట్టు స్కోరు 300 మార్కును దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 79.1వ ఓవర్‌లో జాక్‌ లీచ్‌ విసిరిన బంతిని బౌండరీకి తరలించిన వశీ.. సొంత గడ్డపై తొలి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్‌ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ తమిళనాడు ఆటగాడు.. గబ్బా మైదానంలో తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 62 పరుగులతో రాణించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ విషయానికొస్తే.. 95.5 ఓవర్లలో 337 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

చదవండి: Ind Vs Eng Highlights: రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్

మరిన్ని వార్తలు