India Vs Ireland: కొత్తవారికి అవకాశం దక్కేనా!

26 Jun, 2022 00:54 IST|Sakshi
కెప్టెన్‌ హార్దిక్, కోచ్‌లు బహుతులే, లక్ష్మణ్‌

నేడు ఐర్లాండ్‌తో భారత్‌ తొలి టి20

రాత్రి గం. 9 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3, టెన్‌–4లో ప్రత్యక్ష ప్రసారం

డబ్లిన్‌: ఇంగ్లండ్‌తో ప్రధాన పోరుకు ముందు భారత క్రికెట్‌ జట్టు మరో సంక్షిప్త సిరీస్‌కు సన్నద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు మ్యాచ్‌ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో టెస్టు టీమ్‌లో లేని ఇతర ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా... కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తాడు. బలాబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్‌పై భారత్‌దే స్పష్టంగా పైచేయి కాగా, సొంతగడ్డపై సత్తా చాటా లని ఐర్లాండ్‌ భావిస్తోంది.   

సామ్సన్‌ను ఆడిస్తారా...
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నుంచి చివరి వరకు మార్పు లేకుండా ఆ 11 మందినే ఆడించారు. అయితే ఈసారి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొత్తగా ప్రయత్నించవచ్చు. పేసర్లు అర్‌‡్షదీప్, ఉమ్రాన్‌ మాలిక్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టవచ్చని అంచనా. బ్యాటింగ్‌పరంగా గత మ్యాచ్‌ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్‌ లేరు కాబట్టి రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా, సామ్సన్‌ మరో చాన్స్‌ కోసం చూస్తున్నాడు.   

పోటీనిస్తారా...
గత ఏడాది టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఐర్లాండ్‌ పెద్ద జట్టుతో మ్యాచ్‌లు ఆడలేదు. అమెరికా, యూఏ ఈలతో మాత్రమే తలపడిన టీమ్‌కు ఇన్నేళ్లలో కూడా పెద్ద జట్లను ఎదు ర్కొనే అవకాశం ఎక్కువగా రాలేదు. భారత్‌ తర్వాత ఆ టీమ్‌ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ఆడనుంది. టి20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భారత్‌తో సిరీస్‌ పనికొస్తుంది. భారత్‌తో గతంలో ఆడిన 3 టి20ల్లోనూ ఐర్లాండ్‌ ఓడింది. ప్రస్తుత జట్టులోని సీనియర్లు స్టిర్లింగ్, డాక్‌రెల్‌తో పాటు కెప్టెన్‌ బల్బరీన్‌ జట్టు భారం మోస్తున్నారు. కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్లతో కలిసి వీరు జట్టును ఎలా గెలుపు దిశగా నడిపిస్తారనేది చూడాలి.

మరిన్ని వార్తలు