కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌.. కొత్తకొత్తగా..!

17 Nov, 2021 03:10 IST|Sakshi

మరో సిరీస్‌కు భారత జట్టు సిద్ధం

నేడు న్యూజిలాండ్‌తో తొలి టి20

సిరీస్‌కు విలియమ్సన్‌ దూరం

రాత్రి గం. 7:00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

టి20 వరల్డ్‌కప్‌ ఫేవరెట్‌లలో ఒకరిగా బరిలోకి దిగి కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిన భారత జట్టు సొంతగడ్డపై మళ్లీ కొత్తగా సీజన్‌ను మొదలు పెట్టేందుకు సన్నద్ధమైంది. ‘ప్రపంచకప్‌’ ఓటమి వేదన ‘పేటీఎమ్‌ కప్‌’తో తీరదు కానీ ఆట ఆగిపోదు కాబట్టి మరో టి20 సమరానికి సమయం వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే మరో ఏడాదిలోపే జరిగే తర్వాతి టి20 ప్రపంచకప్‌ ప్రణాళికలు కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ల నేతృత్వంలో ఈ సిరీస్‌ నుంచే మొదలు కానున్నాయి. మరోవైపు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడిన మూడు రోజుల్లోపే, ఆ ఓటమి బాధ నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒక ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సిన పరిస్థితిలో దురదృష్టవశాత్తూ న్యూజిలాండ్‌ నిలిచింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి టీమిండియా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తుండగా... విలియమ్సన్‌ లేని కివీస్‌ ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి.    

IND vs NZ T20: Important Things About Rohit Sharma and Rahul Dravid: వరల్డ్‌కప్‌లో నమీబియాతో తమ చివరి మ్యాచ్‌ ఆడిన భారత తుది జట్టులో కొన్ని తప్పనిసరి మార్పులు జరగనున్నాయి. రోహిత్, రాహుల్, సూర్యకుమార్, అశ్విన్‌లు మాత్రమే ఇక్కడా ఆడే అవకాశం ఉండగా. కోహ్లి, జడేజా స్థానాల్లో ఇషాన్‌ కిషన్, అక్షర్‌ పటేల్‌ ఆడనున్నారు. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కని లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. ఇద్దరు పేసర్లు షమీ, బుమ్రా దూరం కావడంతో భువనేశ్వర్‌కు మరో అవకాశం లభించింది. ఒకప్పటి తన బౌలింగ్‌తో పోలిస్తే పదును కోల్పోయిన భువీ ఈసారి ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది కీలకం.

ఇక చివరిసారిగా 2018 మార్చిలో భారత టి20 టీమ్‌ తరఫున ఆడిన హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు మరో అవకాశం లభించింది. తన టెస్టు ప్రదర్శనతో కీలక సభ్యుడిగా మారిన అతను ఐపీఎల్‌లోనూ రాణించి టి20ల్లో చాన్స్‌ దక్కించుకున్నాడు. ఇక మిడిలార్డర్‌లో మరో బ్యాట్స్‌మన్‌ స్థానం కోసం మాత్రమే తీవ్రంగా పోటీ ఉంది. ఇప్పటికే భారత్‌కు ఆడిన అనుభవం ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ ముందు వరుసలో ఉన్నా... అతనికి రుతురాజ్, వెంకటేశ్‌ అయ్యర్‌లనుంచి పోటీ ఉంటుంది. తాజా ఫామ్‌ చూసుకుంటే రుతురాజ్‌ అద్భుతంగా ఆడుతుండగా... బౌలింగ్‌ కూడా చేయగలగడం వెంకటేశ్‌ బలం.

జేమీసన్‌కు చోటు...
మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు ఫైనల్లో ఓడిన 24 గంటలలోపు సిరీస్‌ ఆడేందుకు సోమవారం సాయంత్రం జైపూర్‌లో దిగింది. టెస్టు సిరీస్‌కు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్న  కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టి20 సిరీస్‌ నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించాడు. దాంతో సారథిగా టిమ్‌ సౌతీ వ్యవహరిస్తాడు. బౌల్ట్‌ కూడా టీమ్‌లో లేకపోగా... కాన్వే, ఫెర్గూసన్‌ ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్నారు. వరల్డ్‌కప్‌ ఆడని వారిలో కొత్తగా మార్క్‌ చాప్‌మన్, కైల్‌ జేమీసన్‌ ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. 

ఐపీఎల్‌లో ముంబైకి ఐదు టైటిల్స్‌ అందించిన రోహిత్‌ శర్మ భారత జట్టు టి20 నాయకత్వం కూడా కొత్త కాదు. కోహ్లి గైర్హాజరులో 2017–2020 మధ్య అతను 19 మ్యాచ్‌లలో భారత్‌కు సారథిగా వ్యవహరించాడు. ఇందులో 15 విజయాలు దక్కగా, 4 సార్లు జట్టు ఓడింది. అతని కెప్టెన్సీలో జట్టు ఆసియా కప్‌ కూడా గెలిచింది. అయితే కోహ్లి అధికారికంగా తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో అతను టి20 కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. 

మరిన్ని వార్తలు