ICC Womens World Cup: కివీస్‌తో తేల్చుకోవాల్సిందే

10 Mar, 2022 03:36 IST|Sakshi

నేడు భారత మహిళల రెండో మ్యాచ్‌

ఉదయం గం. 6:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

హామిల్టన్‌: ప్రపంచకప్‌ సన్నాహాల కోసమే న్యూజిలాండ్‌కు వచ్చిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిపోయింది. అయితే అసలైన వరల్డ్‌కప్‌లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి మిథాలీ రాజ్‌ బృందం శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో జైత్రయాత్ర సాగించాలని టీమిండియా ఆశిస్తోంది. గురువారం భారత్‌ తమ రెండో లీగ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాక్‌తో తొలి మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ బ్యాటింగ్‌ గొప్పగా అయితే లేదు. టాపార్డర్‌లో ఓపెనర్‌ షఫాలీ వర్మ సహా మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ కెప్టెన్‌ మిథాలీ, హర్మన్‌ప్రీత్‌ కౌర్, రిచా ఘోష్‌ ఇలా ఏ ఒక్కరూ పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు.

వీరంతా కలిసి చేసింది 15 పరుగులే! లోయర్‌ ఆర్డర్‌లో స్నేహ్‌ రాణా, పూజ వస్త్రకర్‌ రాణించకపోతే టీమిండియా కష్టాల్లో పడేది. ఇప్పుడు పటిష్టమైన న్యూజిలాండ్‌తో ఏ ఒకరో ఇద్దరో ఆడితే ఏ మాత్రం సరిపోదు. పాక్‌తో ఆడినట్లు ఆడితే అసలు కుదరనే కుదరదు. ముఖ్యంగా మిడిలార్డర్‌ బాధ్యత తీసుకోవాలి. ఓపెనర్‌ స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం సానుకూలాంశమైనప్పటికీ మిగతావారు కూడా జట్టు స్కోరులో భాగం కావాలి. అప్పుడే ఆతిథ్య జట్టుకు సవాల్‌ విసరొచ్చు. లేదంటే ద్వైపాక్షిక సిరీస్‌లో ఎదురైన ఫలితమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.  

పటిష్టంగా కివీస్‌ 
మరోవైపు కివీస్‌ తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో చివరి ఓవర్లో ఓడింది. కానీ వెంటనే తేరుకున్న న్యూజిలాండ్‌... బంగ్లాదేశ్‌ను సులువుగా ఓడించింది. ఓపెనర్లు సోఫీ డివైన్, సుజీ బేట్స్, అమెలియా కెర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. బౌలింగ్‌లోనూ లియా తహుహు, జెస్‌ కెర్, అమీ సాటర్త్‌వైట్‌ ప్రత్యర్థి బ్యాటర్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సొంతగడ్డ అనుకూలతలు ఎలాగూ ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసిన కూడా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య గురువారం ఆసక్తికర పోరు జరగడం ఖాయం. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఓవరాల్‌గా ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచాయి. మరో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. 

మరిన్ని వార్తలు