ఊరించి... ఉసూరుమనిపించి...

19 Jun, 2021 03:42 IST|Sakshi

వర్షం బారిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌

తొలి రోజు ఆట పూర్తిగా రద్దు

రిజర్వ్‌ డేకు మ్యాచ్‌ వెళ్లే అవకాశం!  

భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)కు ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. ఎడతెరిపి లేని వర్షం తొలి రోజు ఆటను తుడిచి పెట్టేసింది. ఒక్క బంతి కూడా వేసేందుకు అవకాశం లేకపోవడంతో ఆటగాళ్లు మైదానంలోకి దిగాల్సిన అవసరం కూడా లేకుండా మొదటి రోజు ముగిసింది. శనివారం నుంచి వాతావరణ పరిస్థితి మెరుగుపడి భారత్, న్యూజిలాండ్‌ పోరు అనుకున్న విధంగా సాగుతుందా లేక ఇదే వాన చివరకు నిస్సారమైన ఫలితానికి దారి తీసి చివరకు  సంయుక్త విజేతను అందిస్తుందా అనేది చూడాలి.

సౌతాంప్టన్‌: భారత్, న్యూజిలాండ్‌ మధ్య వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి రోజు ఆటకు వర్షంవల్ల కొద్దిసేపు అంతరాయం కలగవచ్చని ఊహించినా... వాన అనుకున్న దానికంటే ఎక్కువే  ప్రభావం చూపించింది. ఫలితంగా మ్యాచ్‌ తొలి రోజు శుక్రవారం ఆట పూర్తిగా రద్దయింది. మ్యాచ్‌ ముందు రోజునుంచే కురుస్తున్న వర్షం తెరిపినివ్వలేదు. కనీసం టాస్‌ వేసే అవకాశం కూడా కలగలేదు. స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.30కి (భారత కాలమానం ప్రకారం మ.3.00 గంటలు) మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే వాన తగ్గకపోవడంతో అంపైర్లు ముందుగా తొలి సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాన ఆగింది. సుమారు అరగంట పాటు చినుకులు లేకపోవడంతో సూపర్‌ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. లంచ్‌ విరామం ముగిసిన తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు వెళ్లాల్సి ఉంది. ఈలోగా మళ్లీ వాన ప్రారంభం కావడంతో ఆ సమయానికి ముందే తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.   

ఆరో రోజుకు ఆట...
డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఐసీసీ ఈ నెల 23ను రిజర్వ్‌ డేగా ప్రకటించింది. ఐదు రోజుల్లోనే పూర్తి ఆట ఆడించేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతేనే ఆరో రోజుకు వెళతామని గతంలోనే చెప్పింది. అయితే ఇప్పుడు అది తప్పనిసరి కావచ్చు. నేటి నుంచి రోజుకు అరగంట అదనపు సమయం చొప్పున గరిష్టంగా 98 ఓవర్ల వరకు (ఎలాంటి అంతరాయం లేకపోతే) ఆడించవచ్చు. అలా చేసినా నాలుగు రోజుల్లో 32 ఓవర్లకు మించి అదనంగా ఆడించే ఛాన్స్‌ లేదు. దీని ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్‌ రిజర్వ్‌ డేన కొనసాగే అవకాశం ఉంది.  

లార్డ్స్‌ ఉండగా సౌతాంప్టన్‌ ఎందుకు...
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వేదికగా సౌతాంప్టన్‌ను ప్రకటించినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు లండన్‌లోని లార్డ్స్‌ లేదా ఓవల్‌ మైదానం కాకుండా దీనిని ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు వర్షంతో తొలి రోజు రద్దు కావడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. నిజానికి తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎవరు వచ్చినా క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లోనే జరపాలని ఐసీసీ ఎప్పుడో నిర్ణయించింది. ముందుగా లార్డ్స్‌ను వేదికగా కూడా ప్రకటించింది. అయితే కరోనా కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో బయో బబుల్‌ కోసం సరైందిగా భావిస్తూ స్టేడియం పరిధిలోనే హోటల్‌ ఉండటంతో సౌతాంప్టన్‌ను ఎంపిక చేసింది.

అయితే భారత్‌లో ఇటీవల ఇంగ్లండ్‌ వచ్చినప్పుడు చేపాక్‌ స్టేడియానికి ఎక్కడో దూరంగా ఉన్న లీలా హోటల్‌లో ఇరు జట్లను బయో బబుల్‌లో ఉంచారు. అలాంటిది ఇంగ్లండ్‌లాంటి చోట సాధ్యం కాదా అనిపించవచ్చు. అయితే ఇంగ్లండ్‌లో అలాంటి వేదిక ఒకటి అందుబాటులో ఉంది కాబట్టే సౌతాంప్టన్‌కు ఎంపిక చేశారు. సాధారణంగా ఇంగ్లండ్‌లో జూన్‌లో పెద్దగా వర్షాలు పడవు. పైగా గత రెండు వారాలుగా ఇక్కడ తీవ్ర ఎండ, వేడి ఉన్నాయి. అయితే అప్పడప్పడూ అనుకోకుండా వాన పలకరించే అనిశ్చితి మాత్రం ఇంగ్లండ్‌ అంతటా సహజం. కాబట్టి మరో నగరాన్ని వేదికగా ఎంచుకున్నా వాన రాకపోయేదని ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు