Ind Vs NZ: ఆఖరి ఆటకు సిద్ధం!

1 Feb, 2023 04:26 IST|Sakshi

నేడు భారత్, న్యూజిలాండ్‌ మూడో టి20

గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్‌

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఇప్పటికే మూడు టి20 సిరీస్‌లు గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్‌లో తుది సమరానికి సన్నద్ధమైంది. ఏకపక్షంగా సాగిన వన్డేలతో పోలిస్తే రెండు టి20ల్లోనూ న్యూజిలాండ్‌ నుంచి టీమిండియా గట్టి పోటీ ఎదుర్కొంది. దాంతో సిరీస్‌ ఫలితం చివరి మ్యాచ్‌కు చేరింది. ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ కారణంగా మున్ముందు కొన్ని నెలల పాటు భారత జట్టు టి20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన జట్టు విజయంతో ముగిస్తుందా లేక కివీస్‌ తన సత్తా చాటి సిరీస్‌ సాధిస్తుందా చూడాలి.   

అహ్మదాబాద్‌: సొంతగడ్డపై శ్రీలంకను చిత్తు చేసి రెండు ఫార్మాట్‌లలోనూ సిరీస్‌ గెలుచుకున్న భారత జట్టు న్యూజిలాండ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. వన్డేల్లో విజేతగా నిలిచిన టీమిండియా, టి20ల్లో సిరీస్‌ అందుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఈ అవకాశాన్ని వదిలి పెట్టరాదని పట్టుదలగా ఉంది. ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేడు జరిగే చివరి టి20 మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. తాజా ఫామ్, జట్లను చూస్తే మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.  

ఉమ్రాన్‌కు చాన్స్‌... 
రోహిత్, రాహుల్, కోహ్లిల గైర్హాజరులో భారత్‌ టాప్‌–3 ఈ సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేదనేది స్పష్టం. గిల్, ఇషాన్, రాహుల్‌ త్రిపాఠి అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగ్గా రాణిస్తే మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత టీమ్‌లోకి ఎంపికైన పృథ్వీ షాకు ఆడే అవకాశం రాకుండానే సిరీస్‌ ముగిసిపోయేలా కనిపిస్తోంది. బౌలింగ్‌లో భారత తుది జట్టులో ఒక మార్పు జరగవచ్చు. లక్నోలాంటి టర్నింగ్‌ పిచ్‌ కాకపోవడంతో మళ్లీ చహల్‌ స్థానంలో ఉమ్రాన్‌ జట్టులోకి రావచ్చు.    

అరుదైన అవకాశం... 
న్యూజిలాండ్‌ జట్టు 2012లో చెన్నైలో జరిగిన ఏకైక టి20లో భారత్‌ను ఓడించింది. అది మినహా 1955 నుంచి ఏ ఫార్మాట్‌లో కూడా మన గడ్డపై ఆ జట్టు సిరీస్‌ గెలవలేకపోయింది. అయితే తాజా ఫామ్‌ను బట్టి చూస్తే తమ జట్టు ఆ అరుదైన ఘనత అందుకోగలదని కివీస్‌ ఆశిస్తోంది. టీమ్‌ తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కాన్వే జోరు మీదుండగా, ఇతర ఆటగాళ్ల నుంచి కూడా తగిన సహకారం అందుతోంది. అలెన్, ఫిలిప్స్‌ బ్యాటింగ్‌లో కీలకం కానుండగా, ఆల్‌రౌండర్లు బ్రేస్‌వెల్, మిచెల్‌ కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు సాన్‌ట్నర్, ఇష్‌ సోధి భారత లైనప్‌ను కట్టిపడేయగల సమర్థులు. వ్యక్తిగతంగా గొప్ప ఘనతలు లేకపోయినా... సమష్టిగా తమ జట్టు బలమైందని ఎన్నోసార్లు నిరూపించిన న్యూజిలాండ్‌ మళ్లీ అదే పట్టుదలను చూపిస్తే సంతోషంగా తిరిగి వెళ్లవచ్చు.  

పిచ్, వాతావరణం 
నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌ రోజు వర్ష సూచనలేదు. పశ్చిమ భారత్‌లో పెద్దగా మంచు ప్రభావం లేదు.  

►గత పదేళ్లలో భారత జట్టు సొంతగడ్డపై మూడు ఫార్మాట్‌లలో కలిపి 55 సిరీస్‌లు ఆడింది. ఇందులో 47 సిరీస్‌లు గెలవడం విశేషం. ఒక్క ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మాత్రమే భారత్‌ను ఓడించగలిగాయి.   

మరిన్ని వార్తలు