IND Vs SL: మ్యాచ్‌ మధ్యలో ద్రవిడ్‌తో లంక కెప్టెన్‌ ఆసక్తికర చర్చ

24 Jul, 2021 10:24 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, లంక కెప్టెన్‌ దాసున్‌ షనకల మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాళ్లిద్దరి మధ్య ఏం అంశంపై చర్చకు వచ్చిందన్నది తెలియదు గానీ బహుశా ద్రవిడ్‌ షనకకు కొన్ని విలువైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. యాదృశ్చికంగా వర్షం అనంతరం మ్యాచ్‌ ప్రారంభం అయిన తర్వాత లంక బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్‌ చేసి భారత్‌ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. అంతేగాక వరుస విరామాల్లో వికెట్లు తీసి భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా చేసింది.

అయితే ద్రవిడ్‌ షనకకు మ్యాచ్‌కు సంబంధించి ఏమైనా కీలక సూచనలు చేశాడా అని అభిమానులు తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం దీన్ని కొట్టిపారేస్తూ.. అంతర్జాతీయ కెరీర్‌లో​ ఎంతో అనుభవం గడించిన ద్రవిడ్‌ను షనక తన బ్యాటింగ్‌ గురించి సలహాలు అడిగి ఉంటాడని పేర్కొన్నారు. ఏదేమైనా ద్రవిడ్‌, షనకల సంభాషణపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెట్టిన కామెంట్లు ఒకసారి పరిశీలించండి.''  ద్రవిడ్‌ను గొప్ప ఆటగాడు అని ఎందుకు అంటారనడానికి ఈ ఉదాహరణ చాలు.. షనక ద్రవిడ్‌తో మాట్లాడి తన విలువనను మరింత పెంచుకున్నాడు.. సంగక్కర తర్వాత నువ్వు మంచి కెప్టెన్‌గా పేరు సంపాదిస్తావు.. బహుశా షనక ద్రవిడ్‌ను వాళ్ల ప్రధాన కోచ్‌గా రమ్మని అడిగి ఉంటాడు.. '' అంటూ ట్వీట్స్‌ చేశారు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సొంతగడ్డపై భారత్‌ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ పృథ్వీ షా (49 బంతుల్లో 49; 8 ఫోర్లు), అరంగేట్రం చేసిన సంజూ సామ్సన్‌ (46 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) రాణించారు. అకిల ధనంజయ, ప్రవీణ్‌ జయవిక్రమ చెరో మూడు వికెట్లు సాధించి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్డడి చేశారు. ఛేజింగ్‌లో శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు గెలుపు బాటలు వేశారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆదివారం మొదలవుతుంది.  

మరిన్ని వార్తలు