India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’

28 Sep, 2022 04:55 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టి20 నేడు

జోరు మీదున్న రోహిత్‌ సేన

ప్రపంచకప్‌కు ముందు చివరి సిరీస్‌

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

తిరువనంతపురం: ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్‌ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్‌లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్‌ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో రోహిత్‌ బృందం తలపడనుంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది.

ఈ టోర్నీ హోరాహోరీ పోటీ కోసమే కాదు... తుది కసరత్తుకు ఆఖరి సమరంగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడనుంది. ఇప్పటికే 11 మంది ఎవరనే ప్రాథమిక అంచనాకు వచ్చిన జట్టు మేనేజ్‌మెంట్‌కు డెత్‌ ఓవర్ల బెంగ పట్టి పీడిస్తోంది. బుమ్రా వచ్చాక కూడా ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం బౌలింగ్‌ దళంపై కంగారు పెట్టిస్తోంది. ఈ సమస్యను అధిగమిస్తేనే కసరత్తు పూర్తి అవుతుంది.

బ్యాటింగ్‌ భళా
భారత బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. మరీ ముఖ్యంగా అనుభవజ్ఞులైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఫామ్‌లో ఉండటం కాదు... సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇన్నేళ్లయినా ఇద్దరి షాట్లు కుర్రాళ్లను మించి చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యకుమార్‌ ఇప్పుడు మెరుపుల్లో తురుపుముక్కలా మారాడు. ఆసీస్‌తో ఆఖరి మ్యాచ్‌ గెలుపునకు అతని ఇన్నింగ్సే అసలైన కారణం.

రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్‌ ఇలా బ్యాటింగ్‌లో అంతా మెరుగ్గానే ఉంది. నిలకడగా మెరిపిస్తోంది. ఈ సిరీస్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బౌలర్లే కీలకమైన దశలో డీలాపడటం, యథేచ్ఛగా పరుగులు కాదు వరుసబెట్టి బౌండరీలు, సిక్సర్లు ఇచ్చుకోవడం జట్టు భారీ స్కోర్లను కూడా సులువుగా కరిగిస్తున్నాయి.  

సవాల్‌కు సిద్ధం  
జోరు మీదున్న భారత్‌కు దీటైన సవాల్‌ విసిరేందుకు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. ఓపెనింగ్‌లో డికాక్, కెప్టెన్‌ బవుమాలతో పాటు మిడిలార్డర్‌లో హార్డ్‌ హిట్టర్లు మార్క్‌రమ్, మిల్లర్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ ఆతిథ్య జట్టులాగే పటిష్టంగా ఉంది. ఇందులో ఏ ఇద్దరు భారత్‌ బౌలింగ్‌పై మెరిపించినా కష్టాలు తప్పవు. ఇక సఫారీ బౌలింగ్‌ ఒకింత మనకంటే మెరుగనే చెప్పాలి.

ప్రిటోరియస్, రబడ, నోర్జేలు అద్భుతంగా రాణిస్తున్నారు. టి20 సమరానికి సరైన సరంజామాతోనే దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఆసీస్‌పై గెలిచిన ధీమాతో ఏమాత్రం ఆదమరిచినా టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తప్పదు.

భారత క్రికెటర్లపై పూల వాన
కేరళ అభిమానులు భారత క్రికెటర్లకు అడుగడుగునా జేజేలు పలికారు. విమానం దిగగానే మొదలైన హంగామా బస చేసే హోటల్‌ వద్దకు చేరేదాకా సాగింది. అక్కడ ఆటగాళ్లపై పూల వాన కురిసింది. కేరళ కళాకారుల నుంచి సంప్రదాయ స్వాగతం లభించింది.

మరిన్ని వార్తలు