Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు!

9 Jun, 2022 04:52 IST|Sakshi
కెప్టెన్‌ పంత్, చహల్‌

నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి టి20

గాయాలతో రాహుల్, కుల్దీప్‌ అవుట్‌

రాత్రి గం. 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–1లో

India Vs South Africa 2022 T20 Series- న్యూఢిల్లీ: రాబోయే టి20 ప్రపంచకప్‌ కోసం కాబోయే టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు భారత బోర్డు ఈ సీజన్‌లో ఎక్కువగా పొట్టి మ్యాచ్‌లనే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా భారత జట్టు గట్టి ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో ఐదు పొట్టి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. గురువారం ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది.

అయితే ఒక రోజు ముందే టీమిండియా స్థయిర్యానికి గాయాలు పరీక్ష పెట్టాయి. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లేని ఈ సిరీస్‌కు సరైన నాయకుడిగా భావించి కేఎల్‌ రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తే అతను గాయంతో ఉన్నపళంగా సిరీస్‌ మొత్తానికి దూరం కావడం జట్టుకు షాక్‌ ఇచ్చింది. మరోవైపు స్టార్లు, సత్తాగల అనుభవజ్ఞులతో సఫారీ జట్టు సవాలు విసురుతోంది.  

ఆశలన్నీ కుర్రాళ్లపైనే...
కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ టాపార్డర్‌ కోహ్లి, సీనియర్‌ సీమర్‌ బుమ్రాలకు ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. తాజాగా రాహుల్, కుల్దీప్‌లు కూడా అనూహ్యంగా దూరమవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెట్టే అంశమైనా... యువ ఆటగాళ్లకు మాత్రం ఇది లక్కీ చాన్స్‌! రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌లో సత్తా చాటుకునేందుకు ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది.

ఆల్‌రౌండర్లు దీపక్‌ హుడా, హర్షల్‌ పటేల్‌లతో పాటు అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తుది జట్టులో స్థానాలు దాదాపు ఖాయం. ఈ నేపథ్యంలో టీమిండియా పూర్తిగా యువరక్తంతోనే పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్, అనుభవజ్ఞుడైన హార్దిక్‌ పాండ్యా మార్గదర్శనం చేస్తే యువకులు మెరుపులు మెరిపిస్తారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆస్ట్రేలియాకు పయనమయ్యే ప్రపంచకప్‌ జట్టు రేసులో ఉంటారు.

శుభారంభంపై దక్షిణాఫ్రికా కన్ను
సీనియర్లు లేని ఆతిథ్య జట్టును కొత్తగా గాయాలు వేధిస్తుండటంతో అన్నీ అనుకూలతలతో తొలి మ్యాచ్‌ నుంచే పైచేయి సాధించాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా ఉంది. తెంబా బవుమా సారథ్యంలోని ప్రొటీస్‌ సభ్యుల్లో డికాక్, మిల్లర్, రబడ, నోర్జే ఇటీవలే భారత్‌లో ఐపీఎల్‌ ఆడారు.

బ్యాటింగ్‌లో మిల్లర్, డికాక్, బౌలింగ్‌లో రబడ, నోర్జే మెరుగ్గానే రాణించారు. ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం పిచ్‌ కూడా పేస్‌కు కాస్త అనుకూలంగా ఉండటంతో రబడ, నోర్జేలు చెలరేగే అవకాశముంది.  

ఊరించే రికార్డు
టి20 క్రికెట్‌లో టీమిండియా గత 12 మ్యాచ్‌ల్లో విజయాలతో అజేయంగా ఉంది. ఈ వరుసలో అఫ్గానిస్తాన్, రొమేనియాలు 12 విజయాలతో ఉన్నాయి. తొలి టి20లో సఫారీని ఓడిస్తే 13 వరుస విజయాల జట్టుగా భారత్‌ రికార్డుల్లోకెక్కుతుంది.

మరిన్ని వార్తలు