SA Vs IND 1st Test: రెండో రోజు ఆట వర్షార్పణం... భారత్‌కు గెలుపు దక్కేనా!

28 Dec, 2021 08:56 IST|Sakshi

సెంచూరియన్‌: తొలి రోజు చక్కటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్‌కు రెండో రోజే ప్రతికూలత ఎదురైంది. వరుణుడి కారణంగా అదే జోరును కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. వర్షం కారణంగా తొలి టెస్టు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. నగరంలో ఆదివారం రాత్రి నుంచే కురుస్తున్న వాన సోమవా రం కూడా కొనసాగడంతో క్రికెట్‌ సాధ్యం కాలేదు. మధ్యలో రెండుసార్లు వర్షం తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు.

అయితే అదే సమయంలో మళ్లీ వర్షం రావడంతో చేసేదేమీ లేకపోయింది. ఫలితంగా ఒక్క బంతి కూడా వేయకుండానే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:55కు అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (248 బంతుల్లో 122 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 1 సిక్స్‌), అజింక్య రహానే (81 బంతుల్లో 40 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 

గెలుపు దక్కేనా! 
వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. ఆట పూర్తి స్ధాయిలో సజావుగా సాగే అవకాశం ఉంది. అయితే చివరి రోజైన గురువారం కూడా వాన పడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. అదే జరిగితే నాలుగు ఇన్నింగ్స్‌ల ఆట సాగడం దాదాపు అసాధ్యమే. పైగా ఇప్పటి వరకు స్పందిస్తున్న తీరు చూస్తే పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. ఒక్కసారిగా వికెట్లు కుప్పకూలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. టీమిండియాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆట సాగితే కచ్చితంగా మనదే పైచేయి అయి ఉండేది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలవాలని కోరు కుంటున్న భారత్‌కు వర్షం వల్ల మ్యాచ్‌లో ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. 

ఒలీవియర్‌ అందుకే ఆడలేదు! 
భారత్‌తో తొలి రోజు ఒక్క ఇన్‌గిడి మినహా దక్షిణాఫ్రికా బౌలర్లంతా పేలవ ప్రదర్శన కనబర్చారు. సీనియర్‌ రబడ పూర్తిగా విఫలం కాగా, కొత్త బౌలర్‌ మార్కో తేలిపోయాడు. గాయంతో నోర్జే సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో మరో ఫాస్ట్‌ బౌలర్, దేశవాళీలో అద్భుత ఫామ్‌లో ఉన్న డ్యువాన్‌ ఒలీవియర్‌ టెస్టులో కచ్చితంగా ఆడతారని అంతా భావించారు. అయితే అతడిని టెస్టుకు ఎంపిక చేయకపోవడంతో దక్షిణా ఫ్రికా సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో సోమవారం క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) వివరణ ఇచ్చింది. ‘కొన్నాళ్ల క్రితం ఒలీవియర్‌ కోవిడ్‌–19 బారినపడ్డారు. కరోనా ప్రభావపు తదనంతర సమస్యల నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. క్వారంటైన్‌ కారణంగా సరిగా ప్రాక్టీస్‌ సాగకపోగా, క్యాంప్‌ ఆరంభంలోనే తొడ కండరాల గాయంతోనూ బాధ పడ్డాడు. అందుకే అతనికి బదులుగా మార్కోకు అవకాశమిచ్చాం’ అని సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ విక్టర్‌ పిట్సంగ్‌ వెల్లడించారు.

చదవండి: ఇదేమి బౌలింగ్‌రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు!

మరిన్ని వార్తలు